దాడులు ఆపేందుకు చర్యలు
సంక్షోభం నుంచి గట్టెక్కాల్సిన సమయం మైనార్టీ, హిందూ విద్యార్థి నేతలతో ప్రధాని యూనస్ భేటీ

ఢాకా: ఇది దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన సమయమని విడిపోవాల్సిన సమయం కాదని, కలిసి జీవించాల్సిన సమయమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ అన్నారు. మంగళవారం ఢాకేశ్వరి శక్తి పీఠం ఆలయానికి చేరుకున్న యూనస్ మైనార్టీ, హిందు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన దాడులు చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే విద్యార్థులు ఇచ్చిన ఎనిమిది డిమాండ్లపై చర్చించారు. మైనార్టీలపై దాడులు ఆపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఒక కుటుంబం లాంటి దేశంలో అలజడులు సృష్టించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావులేదన్నారు. శాంతిని కాపాడాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందని యూనస్ తెలిపారు.
దేశంలో ఏ ఒక్కరిపై వివక్ష చూపొద్దని అందరికీ సమాన హక్కులు ఉంటాయని ఆయన అన్నారు. ఇటీవల దాడులపై బంగ్లాదేశ్ లోని మైనార్టీలు, హిందువులు లక్షలాది సంఖ్యలో చిట్టగాంగ్, ఢాకాలలో రెండు రోజులు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించి తమ భద్రతకు డిమాండ్ చేశారు. మైనార్టీలకు పది సీట్లు కేటాయించాలన్నారు. అలాగే తమపై దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.