బెంగళూరు బ్లాస్ట్‌లో ఉగ్ర కోణం పేలుడు ఐఈడీ వల్లేనన్న సీఎం
సమగ్ర విచారణకు ఆదేశం.. ఉగ్రపేలుళ్ళేనన్న బీజేపీ యువమోర్చా
బెంగళూరు: బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో శుక్రవారం జరిగిన పేలుడు ఐఈడీ వల్ల జరిగిందని ఈ పేలుడుకు పాల్పడ్డది ఎవరన్నది ఇంకా స్పష్టం కాలేదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. పోలీసుల ద్వారా ప్రాథమికంగా వివరాలందాయన్నారు. దీనిపై సమగ్ర విచారణకు డీజీపీని ఆదేశించామని సీఎం తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి ఓ బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని పేర్కొన్నారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలు కావడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఐఈడీ వల్ల జరిగినట్లు సీఎం పేర్కొన్నారు. దీని ద్వారా పేలుళ్లకు ఎక్కువగా ఉగ్రవాదులు, నక్సల్స్పాల్పడుతుంటారు. దీంతో ఈ బ్లాస్ట్‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పేలుడు పై పూర్తిగా ఆరా తీసేందుకు ఫోర్సెన్సిక్ తోపాటు, ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కూడా రంగంలోకి దిగింది. పేలుడు జరిగిన ప్రాంతంలో బ్యాటరీ, కాలిపోయిన బ్యాగ్, కొన్ని ఐడీ కార్డులు దర్యాప్తు బృందాలు లభించినట్లు రాష్ర్ట హోంమంత్రి తెలిపారు. ఫోర్సెన్సిక్ నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీజీపీ అలోక్ మోహన్తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హై అలెర్ట్ విధించామన్నారు. బ్యాగు వదిలివెళ్లిన నిందితుల కోసం ప్రత్యేక బృందాల వేట కొనసాగుతుందన్నారు.
కాగా పేలుడు ఘటనపై బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాంబు పేలుడు కేసుగా స్పష్టంగా తెలుస్తున్నా, ఉగ్రకోణం ఉందని నిరూపితం అవుతున్నా ఇంకా వదిలిపెట్టిన బ్యాగు అని సీఎం చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఐఈడీ పేలుళ్లకు పాల్పడేది ఉగ్రవాదులే అని స్పష్టం చేశారు.
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్నం 1 గంటకు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో మొత్తం 9 మందికి గాయాలయ్యాయి. తొలుత సిలిండర్ పేలుడు అని భావించినా రంగంలోకి దిగిన ఫోరెన్సిక్, ఎన్ఐఏల విచారణలో ఐఈడీ బాంబ్లస్టింగ్గా తేలింది.