యూపీ–6, ఝార్ఖండ్–1, అసోం–3 మిత్రపక్షాలకు బీజేపీ సీట్ల కేటాయింపు
లోక్ సభ ఎన్నికలు–2024లో బీజేపీ యూపీ, ఝార్ఖండ్, అసోంలలో మిత్రపక్షాలకు కేటాయించనున్న సీట్లను శుక్రవారం ప్రకటించింది. యూపీలో ఎన్డీఏ మిత్రపక్షమైన అప్పాదళ్, ఆర్ఎల్డీలకు రెండు చొప్పున సీట్లు కేటాయించింది.
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు–2024లో బీజేపీ యూపీ, ఝార్ఖండ్, అసోంలలో మిత్రపక్షాలకు కేటాయించనున్న సీట్లను శుక్రవారం ప్రకటించింది. యూపీలో ఎన్డీఏ మిత్రపక్షమైన అప్పాదళ్, ఆర్ఎల్డీలకు రెండు చొప్పున సీట్లు కేటాయించింది. నిషాద్ పార్టీకి, ఓంప్రకాష్ రాజ్‌భర్ పార్టీకి ఒక్కో సీటు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. మొత్తం యూపీలో ఆరు సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది. ఝార్ఖండ్ లో 1, అసోంలో ఏజీపీకి 2 సీట్లు, యూపీపీఎల్‌కు ఒక సీటు ఇవ్వనుంది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు మీడియాకు తెలిపారు. అయితే సీట్లపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. బీహార్‌లో జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్‌జేపీ (రామ్ విలాస్), పశుపతి పరాస్‌కు చెందిన ఎల్‌జేపీ (రాష్ట్రీయ), ఉపేంద్ర కుష్వాహా, జితన్ రామ్ మాంఝీలతో సీట్ల పంపకంపై ఇంకా తుది చర్చలు జరగాల్సి ఉంది. మహారాష్ట్రలో శివసేన (షిండే), ఎన్సీపీలతో సీట్ల పంపకంపై తుది చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. బీహార్, మహారాష్ట్రల్లో సీట్ల పంపకం ఇంకా ఖరారు కాలేదు. అదే సమయంలో హర్యానాలో ఉన్న పది స్థానాల్లోనూ బీజేపీ సింగిల్‌గానే పోటీకి దిగనుంది. దుష్యంత్ చౌతాలా (జేజేపీ)తో ఎలాంటి ఒప్పందం జరగలేదని బీజేపీ స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆయా పార్టీల అధ్యక్షులతో జరిపిన చర్చల్లో నిర్ణయించామని, గురువారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో ఈ మూడు రాష్ర్టాల మిత్రపక్ష సీట్లపై నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు, బీజేపీ సింగిల్‌గానే 370 సీట్లు గెలవాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం బీజేపీ సన్నాహాలు కూడా జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పొత్తులు కుదిరాయి. ఇప్పుడు సీట్ల పంపకాల ఫార్ములా చర్చనీయాంశమైంది. చాలా రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది. చివరి చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఇక ఎన్డీయే మిత్రపక్షాలకు కేటాయించనున్న సీట్ల వివరాలను వెల్లడించడమే తరువాయిగా పార్టీ అధిష్టాన నేతలు పేర్కొన్నారు.