నేడు కొమరవెల్లికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
నెరవేరనున్న కొమరవెల్లి భక్తుల దశాబ్దాల కల ప్రతి ఏటా లక్షల సంఖ్యలో కొమరవెల్లి సందర్శించుకుంటున్న భక్తులు
నా తెలంగాణ, హైదరాబాద్: కొమురవెల్లి మల్లన్న భక్తుల కల నెరవేరినట్టయింది. మల్లన్న భక్తుల సౌకర్యార్థం కొమురవెల్లిలో నిర్మించ తలపెట్టిన రైల్వేస్టేషన్ నిర్మాణానికి కేంద్ర సాంస్కృతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 500 ఏళ్ల నాటి పురాతన శివాలయమైన కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి తెలంగాణతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. మరీ ముఖ్యంగా ప్రతి ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. మనోహరాబాద్ – సిద్దిపేట రైలు మార్గాన్ని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసిన విషయం విధితమే. దీంతో కొమురవెల్లిలో భక్తుల సౌకర్యార్థం.. రైల్వే స్టేషన్ ఉండాలంటూ డిమాండ్లు రావడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ అవసరాన్ని వివరించారు. దీనిపై చర్చించిన తర్వాత కొమురవెల్లిలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్ నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం కొమురవెల్లి లో రైల్వేస్టేషన్ నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ హాజరుకానున్నారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు
నూతనంగా నిర్మించబోయే స్టేషన్ బిల్డింగ్‌లో టిక్కెట్ల విక్రయం కోసం బుకింగ్ విండో, ప్లాట్‌ఫాం, ఫ్యాన్‌లు, వెయిటింగ్ హాళ్లు వంటి సౌకర్యాలు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే స్టేషన్ నుంచి మల్లన్న ఆలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో యాత్రికులతో పాటు విద్యార్థులు, చిన్న వ్యాపారులు, ప్రయాణికులు, కార్మికులకు కూడా ఈ స్టేషన్ ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.