పదేండ్ల నాటి సమస్యలు పునరావృతం
మాజీ సీఎం కేసీఆర్ నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది అంబేద్కర్ పుణ్యమా అని తెలంగాణ తెచ్చుకున్నం దేశంలో ఎక్కడా ఇవ్వని గౌరవం అంబేద్కర్ కు ఇచ్చినం ఎన్నికలు వస్తుంటయి.. పోతుంటయి ప్రజలకు ప్రభుత్వం ఓ నమ్మకం ఇయ్యాలి కాంగ్రెస్ ప్రలోభాలను నమ్మి ఓటు వేశారు ముందు ఆలోచించుకోవాలని ఎన్నోసార్లు చెప్పిన
నా తెలంగాణ , చేవెళ్ల: అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైందని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని ఫైరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవేళ్లలో బీఆర్ఎస్ పార్టీ శనివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వచ్చాక అన్నీ మాయం అయ్యాయని.. పదేళ్ల కిందటి సమస్యలు రాష్ట్రంలో మళ్లీ కనిపిస్తున్నాయన్నారు. దళితులకు రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. అధికారంలోకి వచ్చాక దళిత బంధు పథకాన్ని రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కకడ నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలు మౌనంగా ఉండకుండా పోరాడి సాధించుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుణ్యమా అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా, వారి స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక త్యాగాలు, లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్లు.. వగైరా వగైరా తర్వాత మన తెలంగాణ సాధించుకున్నాం అని గుర్తు చేశారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాజం పక్షాన, మన పక్షాన అంబేద్కర్‌కు నివాళులర్పించారు. ఈ దేశంలోనే ఎక్కడా లేనంత సమున్నత గౌరవం అంబేద్కర్‌కు ఇవ్వాలని రెండు పనులు చేశాం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి దేశానికే సమున్నత గౌరవం వచ్చేలా చేశాం. కొత్తగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. 75 ఏండ్లలో ఇలాంటి పని ఎవరూ చేయలేదు. ఇలా ఆ మహనీయుడికి నివాళులర్పించామని కేసీఆర్ తెలిపారు.
రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎన్నికలు కూడా వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రజానీకానికి ప్రభుత్వం అంటే ఒక ధీమా, ఒక ధైర్యం. మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటుందనే విశ్వాసం ఉండాలి. ప్రజలు కోరుకునేది అదే. యావత్ రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వం మీద ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ మధ్య ఎన్నికల్లో నేను చాలా సభల్లో చెప్పాను. ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి అని చెప్పాను. కొన్ని రకాల ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంతులేని హామీలు, ప్రలోభాలకు ఓటర్లు గురవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నాలుగు నెలలు గడిచి ఐదో నెలలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ఒక్క విషయంలో కూడా ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్దితో కూడిన కార్యాచరణ కనబడుతలేదు. వసతులు, వనరులను కాపాడుకునే నైపుణ్యం కనబడుతలేదు. పదేండ్ల కింద మరిచిపోయిన ఇబ్బందుల మళ్లీ ఇప్పుడు కనబడుతున్నాయని కేసీఆర్ తెలిపారు.
ఐదు పథకాలు పెట్టాం.. రైతాంగాన్ని కాపాడుకున్నాం..
అన్ని వర్గాల్లో ఉన్న రైతులను కాపాడుకోవాలని పట్టుబట్టి ఒక ఐదు పథకాలు పెట్టాం. రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతుబంధు కింద ఎకరానికి రూ.10 వేలు అందించాం. 24 గంటల పాటు రెప్పపాటు పోకుండా నాణ్యమైన విద్యుత్ అందించాం. రైతు చనిపోతే గుంట భూమి ఉన్నా 5 లక్షల బీమా వారం పది రోజుల్లో వచ్చేలా చేసుకున్నాం. అదే విధంగా రైతుల పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు పడేలా చేసుకున్నాం. ఇలా రైతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాం అని కేసీఆర్ తెలిపారు.