సికింద్రాబాద్, తిరుపతిలో నిలిట్ కేంద్రాలు
వచ్చే 3 ఏండ్లలో 10 వేల మందికి నైపుణ్య శిక్షణ
నా తెలంగాణ, హైదరాబాద్: ఐటీ ఎగుమతులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి.. భారతదేశం మరింత పురోగతిని సాధించేందుకు అవసరమైన మానవ వనరుల అభివృద్ధి చేయడం కోసం తెలుగు రాష్ట్రాల్లో రెండు కీలక సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సికింద్రాబాద్, తిరుపతి నగరాల్లో రెండు నిలిట్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధిత రంగాల్లో అత్యున్నతస్థాయి శిక్షణను అందించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(నిలిట్) సెంటర్ల ఏర్పాటు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కిషన్ రెడ్డి అనేకసార్లు చర్చలు జరిపారు. దీంతో కేంద్రం సెంటర్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
సెంటర్లలో నైపుణ్య శిక్షణ
సికింద్రాబాద్, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో 3 ఏళ్ల వ్యవధిలో ఈ కేంద్రాల కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. నిలిట్ చెన్నై ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఈ కేంద్రాల కార్యకలాపాలు తక్షణమే ప్రారంభించనున్నట్లు ఐటీ, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒక్కో నిలిట్ కేంద్రం ద్వారా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కనీసం 5,000 మందికి శిక్షణ లభించనుంది. తెలుగు రాష్ట్రాల్లోని యువతకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు, సంబంధిత రంగాల్లో ముందుకు వెళ్లాలని చూస్తున్న నిరుద్యోగులకు ఈ కేంద్రాలు ఒక చక్కటి అవకాశం. ఎంతో అత్యున్నతస్థాయి శిక్షణను అందించే ఈ కేంద్రాల్లో శిక్షణను పూర్తి చేసుకున్న వారికి టెక్నాలజీ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు లభిస్తాయి.
ప్రధానికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు
సికింద్రాబాద్, తిరుపతి నగరాల్లో నిలిట్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలుపడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కాలానుగుణంగా టెక్నాలజీ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో శిక్షణను అందించే నిలిట్ కేంద్రాలను రెండు తెలుగు రాష్ట్రాల యువత సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగ అవకాశాలను పొందాలని ఆయన ఆకాంక్షించారు.