అలహాబాద్ హైకోర్టు పరిశీలనలో పిటిషన్
లక్నో: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌ను పరిశీలిస్తున్నట్లు అలహాబాద్ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. తమ నిర్ణయాన్ని డిసెంబర్ 19న తెలియజేస్తామని చెప్పింది. రాహుల్ గాంధీ పౌరసత్వంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణను కూడా కోరారు. బీజేపీ నాయకుడు విఘ్నేష్ శిశిర్ పిటిషన్ దాఖలు చేశారు.
యూకె ప్రభుత్వం రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వంపై ఈ మెయిల్ లను పిటిషన్ లో కోర్టుకు ఉదహరించారు. పత్రాలను ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించిందని కోర్టుకు తెలిపారు. డిప్యూటి సొలిసిటర్ జనరల్ ఎస్ బి పాండే పిటిషనర్ వాదనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వీకరించిందని, దానిని ప్రాసెస్ చేస్తోందని నిర్ణయం తీసుకోనుందని తెలిపారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం, ఏ వ్యక్తి కూడా భారత పౌరసత్వాన్ని, మరొక దేశం పౌరసత్వాన్ని ఏకకాలంలో కలిగి ఉండకూడదు.
అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ పరిశీలనలో ఉండగా, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో కూడా ఇదే పిటిషన్ దాఖలు చేశారు. అలహాబాద్ హైకోర్టు విచారణ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కేసును విచారిస్తామని ఢిల్లీ కోర్టు సూచించింది. అలహాబాద్ హైకోర్టులో తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది.