ఘనంగా చిరుతల అంతర్జాతీయ దినోత్సవం
అడవిలోకి రెండు చిరుతలు ప్రధాని చేపట్టిన ఆపరేషన్ చిరుత విజయవంతం
భోపాల్: అంతర్జాతీయ చిరుతల దినోత్సవం సందర్భంగా అగ్ని, వాయు (చిరుతలు)లను మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ నుంచి కునో చీఫ్ కన్జర్వేటర్, లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తమ్ కుమార్ అడవిలోకి వదిలారు. కునోలో మొత్తం ప్రస్తుతం 24 చిరుతపులులున్నాయి. ఇందులో 12 పిల్ల చిరుతలున్నాయి. 70యేళ్ల క్రితం వేట, వాటి ఆవాసాల కొరత వల్ల చిరుతలు భారత్ లో పూర్తిగా అంతరించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను 2022 సెప్టెంబర్ 17న చిరుతలను కునోలో వదిలారు. చిరుతల సంఖ్యను పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రాజెక్ట్ చిరుతకు అంకురార్పణ చేశారు. చిరుతలు భారత్ కు వచ్చిన యేడాదిపాటు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మనుగడ కష్టమే అని భావించినప్పటికీ క్రమేణా భారతీయ వాతావరణానికి అలవాటు పడి ప్రస్తుతం చిరుతల సంఖ్యలో వృద్ధి నమోదవుతూ వస్తోంది. సంతానోత్పత్తిలోనూ పెరుగుదల వల్ల కొత్తగా జన్మించిన చిరుతలు పూర్తిగా భారత వాతావరణానికి అలవాటు పడ్డాయి.