30 రోజుల్లో 11 విపత్తులు మానవాళికి సవాల్​ విసురుతున్న ప్రకృతి విపత్తులు

ప్రపంచంలో తామే పెద్దన్నలమని చెప్పుకుంటున్న మహామహులు సైతం ప్రకృతి బీభత్సాల ముందు చీమంతైనా కారనే విషయాన్ని మరోమారు ప్రకృతి స్పష్టం చేసింది.

May 2, 2024 - 19:39
 0
30 రోజుల్లో 11 విపత్తులు మానవాళికి సవాల్​ విసురుతున్న ప్రకృతి విపత్తులు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​:

సంపన్న దేశమైన దుబాయ్​ నే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య వచ్చిన పలు ఉపద్రవాలు ప్రాణనష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. దుబాయ్​ నీటితో నిండిపోగా మరికొన్ని చోట్ల టోర్నడోలు, అగ్నిపర్వతాల బద్ధలు, భూంకపాలు ఇలా పలు విపత్తుల ద్వారా మానవాళి మనుగడకు మరోమారు సవాల్​ విసురుతున్నాయి. ప్రపంచం మొత్తం గత 30 రోజుల్లో 11 ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంది. ఎడారి దేశమైన దుబాయ్​ లో గత కొన్ని రోజులుగా వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. దుబాయ్​ లో ఈ నెలలో రెండుసార్లు భారీ వర్షాలు కురిసి అతలాకుతలం చేశాయి. 

ఆఫ్రికాలో వరదలు.. 

తూర్పు ఆఫ్రికాలోని వరదల వల్ల కెన్యా ఎక్కువగా ప్రభావితమైంది. అక్కడ 40 ఏళ్లుగా కరవు తాండవం చేస్తుంది. ఉన్నట్లుండి కురిసిన వర్షంతో 180 మంది చనిపోగా, టాంజానియాలో వరదల కారణంగా 155 మంది మృతి చెందారు. బురుండీలోనూ వరదలు సంభవించాయి. 

రష్యాలో వరదలు..

రష్యా, కజకిస్థాన్​ లలో గత రికార్డులు బద్ధలయ్యేలా వర్షాలు సంభవించి వరదలు వచ్చాయి. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రభుత్వాలకు కత్తిమీద సాములా మారింది. 

ఆఫ్ఘాన్​ లో వర్ష బీభత్సం..

పాక్​, ఆఫ్ఘాన్​ లోనూ వర్షాలు, తుపానులు, వరదల కారణంగా 140 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయారు. 

దుబాయ్​..

ఎడారి అత్యంత సంపన్న ప్రాంతంగా పేరొందిన దుబాయ్​, ఒమన్​ లలోనూ భారీ వర్షాలు, వరదలతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 

సౌదీ అరేబియాలో వరదలు..

సంపన్నదేశం జాబితాలో మరో ప్రాంతం సౌదీ అరేబియా. ఇక్కడ కూడా చోటు చేసుకున్న విపరీతమైన వర్షాల వల్ల వరదలు సంభవించాయి. అనేక రహదారులు మూసుకుపోయి పాఠశాలలు మూతపడ్డాయి. రోజువారి కార్యకలాపాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. 

చైనాను వణికించిన సుడిగాలి..

ఆసియాపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న చైనాను సుడిగాలి వణికించింది. ఇక్కడ భారీ టోర్నడోలు, వర్షాలు, తుపానులు, వరదలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. దీంతో పది మంది వరకు మృత్యువాత పడ్డారు. అనేక ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. 

తైవాన్​ లో భూంకంపతో 17మంది మృతి..

తైవాన్​ లో ఏప్రిల్​ 3న 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల భారీ భవంతులు నేలకొరిగాయి. దీంతో 17 మంది మృతి చెందారు. 25 యేళ్ల తరువాత సంభవించిన అత్యంత భయంకరమైన భూకంపంగా ఇది చరిత్ర పుటల్లోకెక్కింది. ఇప్పటికీ చిన్న చిన్న భూకంపాలు తైవాన్​ ను వణికిస్తూనే ఉన్నాయి. 

ఫిలిప్పీన్స్​ కు చెమటలు పట్టిస్తున్న భానుడు..

ఎల్​ నినో కారణంగా ఫిలిప్పీన్స్​ కు భానుడి ఉష్ణోగ్రతలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రోడ్లపై పార్కింగ్​ చేసిన వాహనాలు కోకొల్లలుగా దగ్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భవంతులు సైతం అగ్నికి ఆహుతవుతున్నాయి. అక్కడ ఈ నాలుగు నెలల్లోనే వందకు పైగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 

అరుణాచల్​ లో విరిగిపడ్డ కొండచరియలు..

మరోవైపు భారత్​ లోని అరుణాచల్​ ప్రదేశ్​ లోనూ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లనప్పటికీ రహదారుల కోతతో తీవ్ర నష్టం వాటిల్లింది.

ఈక్వెడార్​ లో విరిగిపడ్డ కొండ చరియలు..

ఆకస్మిక భారీ వర్షాల వల్ల ఈక్వెడార్​ లోని కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి చాలా ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. అలుసి అనే ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది.

ఇంగ్లాండ్​..

సంపన్న దేశమైన ఇంగ్లాండ్​ ను హరికేన్​ వణికించింది. దీని రాక సందర్భంగా 113 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచి సముద్రంలోని అలలు భారీ ఎత్తున ఎగిసిపడి తీరాలను ముంచెత్తాయి. దీంతో ఇంగ్లాండ్​, ఐర్లాండ్​, స్కాట్లాండ్​ ప్రాంతాల్లో విమానాల సేవలు రద్దు చేశారు. 

ఏది ఏమైనా ప్రపంచంలో తామే పెద్దన్నలమని చెప్పుకుంటున్న మహామహులు సైతం ప్రకృతి బీభత్సాల ముందు చీమంతైనా కారనే విషయాన్ని మరోమారు ప్రకృతి స్పష్టం చేసింది. మరోమారు కేవలం 30 రోజుల్లోనే ఇలాంటి ఉపద్రవాలు సంభవించి సంపాదన, ఉగ్రవాదం, అభివృద్ధి, స్వలాభం చూసుకుంటున్న మానవాళికి హెచ్చరికలు జారీ చేసినట్లయ్యింది.