ఎంపీలను తోసేసిన రాహుల్​ 

Rahul pushed the MPs

Dec 19, 2024 - 15:40
 0
ఎంపీలను తోసేసిన రాహుల్​ 

ఇద్దరు ఎంపీలకు తీవ్ర గాయాలు
సారంగి తలకు బలమైన గాయం
స్పృహ కోల్పోయిన ముఖేష్​ రాజ్​ పుత్​
తనపై అరిచాడన్న మహిళా ఎంపీ
చైర్మన్​ కు లిఖిత పూర్వక ఫిర్యాదు
ఎఫ్​ ఐఆర్​ నమోదుకు బీజేపీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గత కొన్ని రోజులుగా పార్లమెంట్​ లో కాంగ్రెస్​, విపక్ష ఇండి కూటమి పార్టీలు సభలను సజావుగా జరగనీయడం లేదు. ప్రతీ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని చూస్తున్నాయి. వారి వ్యవహారశైలిని గమనిస్తే కావాలనే కాంగ్రెస్​ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందనేది స్పష్టం అవుతుంది. రాహుల్​, ప్రియాంక, ఖర్గేలు మిగతా పార్టీల ఎంపీలతో కలిసి గురువారం తీవ్ర రభస సృష్టించేందుకు సిద్ధమయ్యారు. పార్లమెంట్​ ప్రాంగణం బయట ఎంపీలనూ తోసేశారు. 

బీజేపీ ఎంపీ సారంగి, ముఖేష్​ రాజ్​ పుత్​ లను రాహుల్​ గాంధీ తోసేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నాగాలాండ్ బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్నోన్ రాహుల్ గాంధీ తనను నెట్టివేశారని రాజ్యసభ చైర్మన్​ జగదీప్​ ధన్​ ఖర్​ కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్​ లోని గురువారం నిరసన చేపట్టిన కాంగ్రెస్​ ఎంపీలు అనంతరం మకర ద్వారం ద్వారా పార్లమెంట్​ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. బీజేపీ సభ్యులు కూడా కాంగ్రెస్​ సభ్యులతోపాటు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఎంపీ సారంగి తలకు బలమైన గాయమైంది. మరో ఎంపీ ముకేష్​ రాజ్​ పుత్​ లను వెంటనే రామ్​ మనోహర్​ లోహియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందింప చేస్తున్నారు. వీరిని పలువురు బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు పరామర్శించారు. సారంగి, రాజ్​ పుత్​ లకు ఎనిమిది మంది వైద్యుల బృందం చికిత్సనందిస్తుంది. ఇద్దరినీ ఐసీయూలో చేర్చి చికిత్స​ అందిస్తున్నారు. ఎంపీలకు రక్తపోటు పెరిగిందని వైద్యులు తెలిపారు. సారంగి నుదుటిపై కుట్లు వేశామన్నారు. 

బీజేపీ ఎంపీ సారంగి: రాహుల్​ గాంధీ తోసేశారు. దీంతో వేరే ఎంపీ తనపై పడగా తాను మెట్లపై నుంచి కిందపడి గాయపడ్డాను. 

ఎంపీ ఫాంగ్నోన్: తాము సభ బయట నిరసన వ్యక్తం చేస్తుంటే రాహుల్​ గాంధీ తనకు అత్యంత దగ్గరగా వచ్చి అరవడం మొదలుపెట్టారు.  దీంతో తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యాను. మహిళా ఎంపీనని కూడా చూడకుండా తనవద్దకు వచ్చి అరవడం ఆయన అవివేకానికి నిదర్శనం. ఈ విషయాన్ని లేఖ ద్వారా సభాపతికి ఫిర్యాదు చేశాను.

ధర్మేంద్ర ప్రధాన్​: రాహుల్​ గాంధీ బలవంతంగా నెడుతూ పార్లమెంట్​ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో ఎంపీలు కిందపడిపోయారు. సారంగికి తీవ్ర గాయాలు కాగా, ముఖేష్​ రాజ్​ పుత్​ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికి తలకు గాయాలై రక్తస్రావమైంది.

జేపీ నడ్డా: బీజేపీ  ఎంపీలపై రాహుల్​ గాంధీ దురుసు ప్రవర్తన అప్రజాస్వామ్య రీతిలో ఉంది. అంతేగాక మహిళా ఎంపీకి దగ్గరగా వెళ్లి అరవడం, నెట్టేందుకు ప్రయత్నించడం దారుణం. కాంగ్రెస్​ మూడోసారి అధికారం కోల్పోయిందనే దు:ఖంలో పార్లమెంట్​ లో సభలను అడ్డుకుంటోంది. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది. 

రాహుల్​ గాంధీ ఎంపీలపై ప్రవర్తించిన తీరును ఖండిస్తూ బీజేపీకి చెందిన ఎంపీలు బాన్సురి స్వరాజ్​, అనురాగ్​ ఠాకూర్​ లు ఎఫ్​ ఐఆర్​ నమోదు చేయాలని పార్లమెంట్ స్ర్టీట్​ పోలీస్​ స్టేషన్​ కు చేరుకున్నారు. 

గజేంద్రసింగ్​ షెకావత్​: రాహుల్​ చర్యలు ఆమోదయోగ్యం కావు. ప్రజాస్వామ్యంలో సైద్ధాంతికి విభేదాలు ఉండొచ్చు. కానీ శారీరకంగా హింసకు దిగడం అసమంజసం. 

అశ్వినీ వైష్ణవ్​: కాంగ్రెస్​ చరిత్ర మొత్తం దేశం ముందు బట్టబయలవుతుండడంతో ఏం చేయాలో పాలుపోని కాంగ్రెస్​, రాహుల్​ గాంధీ నిరసనల పేరిట పార్లమెంట్​ లో రాద్ధాంతం సృష్టిస్తూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ రోజు చట్టసభ ప్రాంగణంలోనే ఎంపీలను తోసేశారు. ఈయన పార్లమెంట్​ కు ఇచ్చే గౌరవం ఇదేనా? డా. బాబా సాహెబ్​ అంబేద్కర్​ ను అవమానించి ఎవరన్నది దేశం మొత్తానికి తెలుసు. 

రాహుల్​ గాంధీ చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా సీరియస్​ గా తీసుకున్నారు. వెంటనే మంత్రులు పీయూష్​ గోయల్​, కిరణ్​ రిజూజు, స్పీకర్​ ఓంబిర్లా, జగదీప్​ ధన్​ ఖర్​ లతో భేటీ అయ్యారు. 

కాగా గాయపడిన సారంగి, రాజ్​ పుత్​ లతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​ లో మాట్లాడారు. వారి ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. తోపులాట ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలకు సూచించారు.