సైబర్​ భద్రత లేకుండా దేశ ప్రగతి అసాధ్యం

Progress of the country is impossible without cyber security

Sep 10, 2024 - 16:32
 0
సైబర్​ భద్రత లేకుండా దేశ ప్రగతి అసాధ్యం
ఐదువేల నిపుణులను రంగంలోకి దింపాలని కేంద్రం యోచన
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్​ షా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ లో రోజురోజుకు సైబర్​ కార్యకలాపాలు విస్తృతం అవుతున్నందున ఈ రంగంలో ఐదువేల మంది నిపుణులను భద్రత కోసం సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. సైబర్​ భద్రత లేకుండా దేశ ప్రగతి అసాధ్యమన్నారు. సైబర్​ సెక్యూరిటీ జాతీయ భద్రతలో అంతర్భాగమని షా పేర్కొన్నారు. మంగళవారం ఇండియన్​ సైబర్​ క్రైమ్​ కో ఆర్డినేషన్​ సెంటర్​ (14సీ) మొదటి వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో న్యూ ఢిల్లీలో కేంద్రమంత్రి పాల్గొని ప్రసంగించారు. 
 
సాంకేతికత మానవాళికి ఒక వరంలాంటిదన్నారు. ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకునేందుకు అనేక విధానాలను సులభతరం చేయగలిగామన్నారు. అదేసమయంలో సైబర్​ బెదిరింపులు కూడా ఎక్కువయ్యాయని తెలిపారు. వీటిని నివారణకు కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్రం చర్యలకు రాష్ట్రాలు సైబర్​ రిజిస్ట్రీలను ఏర్పాటు చేస్తే, దానికి పరిమితులు ఉంటాయని అమిత్​ షా తెలిపారు. 
 
సైబర్​ నేరాలలో అనుమానిత రిజిస్ట్రీలను ఏర్పాటు చేసుకోవాలని షా సూచించారు. భవిష్యత్​ లో నేరాలను అరికట్టేందుకు ఈ విధానం దోహదపడుతుందన్నారు. బాధితులకు నిరంతరం సైబర్​ భద్రతపై అవగాహన కల్పించడమే ఈ సమావేశం లక్ష్యమన్నారు. 14 సీ ద్వారా దేశ ప్రజలకు అవగాహన, 72 టీవీ చానళ్లు, 190 ఎఫ్​ ఎం చానళ్ల ద్వారా ప్రజలకు సైబర్​ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రచారాన్ని చేపట్టామని తెలిపారు. దేశంలోని ప్రతీ పౌరునికి సైబర్​ నేరాల పట్ల అప్రమత్తత అవసరమని షా స్పష్టం చేశారు. 
 
సైబర్​ నేరాలపై 1930 టోల్​ ఫ్​రీ నెంబర్​ మరింత జనాదరణ పొందాల్సిన ఆవశ్యకతను గుర్తించామన్నారు. దేశంలో 46 శాతం లావాదేవీలు డిజిటల్​ మాధ్యమంగానే జరుగుతున్నాయని తెలిపారు. సైబర్​ నేరగాళ్లు ఉపయోగించే వెబ్​ సైట్లు, సోషల్​ ఖాతాలు, మొబైల్​ యాప్​ లు, బ్యాంకు ఖాతాలను బ్లాక్​ చేశామని తెలిపారు. 
14 సీ సైబర్​ భద్రత విభాగం 2018 అక్టోబర్​ 5న హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. సైబర్​ నేరాలపై అప్రమత్తత, నేరాలు జరగకుండా చూసుకునే విధానాలను ప్రోత్సహించడం, నేరాలు జరిగాక ఎటువంటి చర్యలు తీసుకోవాలనే లక్ష్యాలతో ఈ విభాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.