ఖచ్చితత్వంతో వాతావరణంలో మార్పుల గుర్తింపు
సంక్లిష్టమైన గణనలకు సాంకేతికత తోడు
దేశీయంగా రూపొందిన సూపర్ కంప్యూటర్లు
ఖగోళాన్ని జల్లెడపట్టనున్న అత్యాధునిక సాంకేతికత
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వాతావరణంలో వచ్చే మార్పులను మరింత ఖచ్చితత్వంతో గుర్తించేలా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ‘పరమ రుద్ర’ అనే మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం న్యూ ఢిల్లీ నుంచి వర్చువల్ మాధ్యమంగా దేశానికి అంకితం చేశారు. ఈ సూపర్ కంప్యూటర్లు పూణె, ఢిల్లీ, కోల్ కతాలో అమర్చనున్నారు. వాతావరణంలోని మార్పులు, తుపానులు, సునామీలు వంటి విపత్తులను ఈ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ద్వారా ముందే గుర్తించే అవకాశం ఉంది. సంక్లిష్టమైన గణనలతో కూడిన సాంకేతిక వ్యవస్థ ఇది అని ప్రధాని తెలిపారు. ఈ సాంకేతిక వ్యవస్థలో యువత పాత్ర కీలకమన్నారు. పరమరుద్ర పరిశోధనా రంగంలో నూతన చరిత్ర సృష్టించబోతోందన్నారు.
పరమరుద్ర అనే సూపర్ కంప్యూటర్లు పూర్తి స్వదేశీయంగా రూపొందించారు. ఐదువందల యేళ్ల వరకు చేసే పనిని అత్యంత తక్కువ సమయంలో ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా చేసే వీలు కలుగనుంది.
వాతావరణ అంచనా, వాతావరణం, మెటీరియల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో పరమ రుద్ర సూపర్ కంప్యూటర్‌ను ఉపయోగించనున్నారు. పూణేలోని జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ వేగవంతమైన రేడియో పేలుళ్లు, ఇతర ఖగోళ దృగ్విషయాలను గుర్తించడానికి సూపర్ కంప్యూటర్‌లను ఉపయోగించనున్నారు. ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ (ఐయూఏసీ)లో మెటీరియల్ సైన్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ పరిశోధనల కోసం ఈ సూపర్ కంప్యూటర్ ఉపయోగించనున్నారు.