కరవు, కాటకాలను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధం
సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరవులు కాటకాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వాతావరణ శాఖ సహాయ మంత్రి కీర్తీ వర్ధన్ సింగ్ అన్నారు. గురువారం రాజ్యసభలో ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2011–2020 మధ్య గ్లోబల్ ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ కు ప్రధానంగా మానవ కార్యకలాపాలే కారణమవుతున్నాయని తెలిపారు. వాతావరణంలో మార్పుల కారణంగా హిమానీనదాలు ద్రవీభవనం చెందుతున్నాయని వివరించారు. దీంతో జీవ వైవిధ్యం, వ్యవసాయం, నీటి వనరులు, మానవ ఆరోగ్యం, పట్టణాల్లో మౌలిక సదుపాయాలపై దీని ప్రభావం పడుతుందని తెలిపారు.
జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ ఏపీసీసీ) ద్వారా జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ మిషన్ ద్వారా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాతావరణ మార్పులపై తమ రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశాయని తెలిపారు. ఇదే సమయంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.847.48 కోట్ల విలువైన ప్రాజెక్టులను నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఆమోదించిందని కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.