రష్యాకు ప్రధాని మోదీ.. బుధవారం 16వ బ్రిక్స్ సదస్సు
Prime Minister Modi to Russia.. 16th BRICS conference on Wednesday
జీ జిన్ పింగ్ తో భేటీ?
భారత్ తరఫున ప్రతినిధి బృందానికి కేంద్రమంత్రి జై శంకర్ నాయకత్వం
అమెరికాలో మొదలైన గుబులు
మాస్కో: ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ 16వ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం రష్యాలోని కజాన్ చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. గత నాలుగు నెలల్లో రష్యాలో ప్రధాని పర్యటన రెండోసారి కావడం గమనార్హం. మంగళవారం సాయంత్రం బ్రిక్స్ నేతలో కలిసి పలు విషయాలపై చర్చించనున్నారు. సాయంత్రం విందులో పాల్గొంటారు. పుతిన్ తోనూ భేటీ అవుతారు. అనధికారిక చర్చలు నిర్వహించనున్నారు.
బుధవారం నిర్వహించనున్న బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సదస్సును రెండు సెషన్లుగా విభజించారు. ఒకటి క్లోజ్డ్ ప్లీనరీ కాగా ఓపెన్ ప్లీనరీని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలుదేశాలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రెండేళ్ల తరువాత చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో కూడా భేటీ నిర్వహిస్తారని విదేశాంగ శాఖ ద్వారా సమాచారం అందింది. లడఖ్ లో పెట్రోలింగ్, భారత్, చైనాల మధ్య ఒప్పందం కుదిరాక ఈ చర్చలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ – జీన్ పింగ్ 2022లో చివరిసారిగా ఇండోనేషియా బాలిలో జరిగిన జీ–20 సమ్మిట్ లో కలిశారు.
కాగా 23న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెళ్లనున్నారు. భారత బృందానికి నాయత్వం వహిస్తారు. ఈ సదస్సులో మొత్తం 28 దేశాలు, ఐదు అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. సదస్సులో కజన్ డిక్లరేషన్ ను జారీ చేయనున్నారు. కజాన్ లో భారత్ నూతన కాన్సులేట్ ను ఏర్పాటు చేయనుంది. బ్రిక్స్ దేశాల సదస్సుతో అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆసియా, పసిఫిక్ దేశాలన్నీ ఏకమైతే ప్రపంచ పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికా ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉండడంతో ఈ సదస్సుపై ఒక కన్నేసి ఉంచింది.