సీఆర్పీఎఫ్​ పాఠశాల వద్ద భారీ పేలుడు

రంగంలోకి బాంబు, డాగ్​ స్క్వాడ్​ అణువణువూ తనిఖీ చేస్తున్నామన్న డీసీపీ

Oct 20, 2024 - 11:48
 0
సీఆర్పీఎఫ్​ పాఠశాల వద్ద భారీ పేలుడు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో రోహిణి సీఆర్పీఎఫ్​ పాఠశాల వద్ద భారీ పేలుడు సంభవించింది. సీఆర్పీఎఫ్​ స్కూల్​ గోడ వద్ద నుంచి పేలుడు శబ్దం వినిపించగానే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న డీసీపీ అమిత్​ గోయల్​ స్థానిక పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎఫ్​ ఎస్​ ఎల్​, బాంబు, డాగ్​ స్క్వాడ్​ బృందాలతో తనిఖీలు చేపట్టారు. పేలుడుపై సమాచారం అందగానే ఘటనా స్థలానికి వచ్చామన్నారు. ఏ రకమైన పేలుడు అనే దానిపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఉదయం 7.50నిమిషాలకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే అగ్నిమాపక శాఖను కూడా రప్పించామన్నారు. స్థానికులు చెబుతున్న గోడ వద్ద పేలుడు, నష్టం ఏమీ జరగనట్లు గుర్తించామన్నారు. సమీపంలోని దుకాణం అద్దాలు, పార్కు చేసిన కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇందులో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు, ప్రాణనష్టం కానీ జరగలేదని అమిత్​ గోయల్​ తెలిపారు. 

ప్రస్తుతం అణువణువూ తనిఖీలు, సీసీ కెమెరాల పరిశీల కొనసాగుతుందని తెలిపారు. నమూనాలను కూడా సేకరిస్తున్నామన్నారు. అనంతరమే పేలుడుకు గల కారణం ఏంటనేది తెలిసే అవకాశం ఉందని తెలిపారు.