ఐదో దశకు సిద్ధం.. గతంలో బీజేపీకే సింహాభాగం స్థానాలు

అమేథీ, రాయ్​ బరేలీలో హస్తం ఓటమి ఖాయం?

May 18, 2024 - 18:00
 0
ఐదో దశకు సిద్ధం.. గతంలో బీజేపీకే సింహాభాగం స్థానాలు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​

ఐదో విడత ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మే 20న 49 స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో అత్యధికంగా 14 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. 

రాజ్​ నాథ్​ సింగ్​: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో లోక్‌సభ స్థానం ఈ ఎన్నికల్లో ప్రముఖ స్థానం. బీజేపీ తరపున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నాయకుడిపై ఎస్పీ రవిదాస్ మెహ్రోత్రాను అభ్యర్థిగా చేసింది. మంత్రిగా పనిచేసిన మెహ్రోత్రా ప్రస్తుతం లక్నో సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్నారు. లక్నోలో బీఎస్పీ తన అభ్యర్థిగా సర్వర్ మాలిక్‌ను ఎంపిక చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్ విజయం సాధించారు. 2019లో లక్నో స్థానంలో 54.78శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి కూడా రాజ్​ నాథ్​ విజయం ఖాయమేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ కూడా భారీగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. 

దినేష్‌ ప్రతాప్‌: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత చర్చనీయాంశమైన స్థానాల్లో రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం ఒకటి. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం విశేషం. అప్పుడు సోనియా గాంధీ ఇక్కడి నుంచి గెలిచి లోక్‌సభకు చేరుకున్నారు. సోనియా ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికయ్యారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీని పోటీకి దింపింది. బీజేపీ ఇక్కడ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్‌ను ప్రకటించింది. ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ ప్రస్తుతం యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2019లో రాయ్‌బరేలీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సోనియా గాంధీ బీజేపీ అభ్యర్థి దినేష్‌ ప్రతాప్‌పై విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇక్కడ 54.08శాతం ఓటింగ్ నమోదైంది. అయితే ఈసారి మాత్రం రాయ్​ బరేలీ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉంది. మోదీ పవనాలు ఇక్కడ బలంగా వీస్తుండడానికి తోడు యోగి పాలన మార్కుతో దినేష్​ ప్రతాప్​ సింగ్​ గెలుపు ఖాయమేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

స్మృతి ఇరానీ: కేంద్ర మంత్రి, ప్రస్తుత అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ మరోసారి ఇక్కడ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. నామినేషన్ చివరి రోజున కాంగ్రెస్ తన అభ్యర్థిగా గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్ శర్మను ప్రతిపాదించింది. బీఎస్పీ ఇక్కడ నాన్హే సింగ్ చౌహాన్‌ను అభ్యర్థిగా చేసింది. 2019లో అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఘన
విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇక్కడ 54.08శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి కూడా అమేథీ నుంచి ఓటమి ఖాయమనే భావనతోనే రాహుల్​ గాంధీ ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో రసవత్తర పోటీ కాస్త ‘వార్​ వన్​ సైడే’ అన్నట్లుగా మారి స్మృతి ఇరానీ విజయం ఇక్కడ సునాయాసమే కానుంది.

చిరాగ్ పాశ్వాన్: బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం ఈ ఎన్నికల్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్థానాల్లో ఒకటి. ఇక్కడి నుంచి ఎల్‌జేపీ (ఆర్‌)కు చెందిన చిరాగ్‌ పాశ్వాన్‌ ఎన్‌డీఏ నుంచి పోటీ చేస్తున్నారు. హాజీపూర్ స్థానం నుంచి శివచంద్ర రామ్‌కు ఆర్జేడీ టిక్కెట్టు ఇచ్చింది. శివచంద్ర బీహార్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎల్‌జేపీ నుంచి పశుపతి పరాస్ హాజీపూర్ స్థానం నుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఇక్కడ 55.26శాతం ఓటింగ్ నమోదైంది. కాగా ఈసారి కూడా ఎల్​ జేపీ చిరాగ్​ పాశ్వాన్​ విజయం సాధిస్తారనే ధీమా వ్యక్తం అవుతోంది.

పోటీలో ఉన్న బీజేపీ మంత్రులు..

ముంబై నార్త్ నుంచి వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ రంగంలో ఉన్నారు. పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్​ కిషోర్​ మహన్​ లాల్​ గంజ్​ నుంచి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. లక్నో నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అమేథీ నుంచి స్మృతి ఇరానీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఫతేపూర్​ నుంచి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, దిండోరి నుంచి భారతి ప్రవీణ్ పవార్     రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, కోడెర్మా    అన్నపూర్ణా దేవి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, భివాండి కపిల్ పాటిల్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, బంగాన్ శంతను ఠాకూర్    ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి పోటీలో ఉన్నారు. 

ఏయే రాష్ట్రాల్లో ఓటింగ్..

ఉత్తర ప్రదేశ్ లో 14 స్థానాలకు గాను 144 మంది పోటీ పడుతున్నారు. మహారాష్ట్ర లో 13 సీట్లకు గాను 264, పశ్చిమ బెంగాల్ లో 7 సీట్లకు గాను  88, బీహార్ లో ఐదు స్థానాలకు గాను 80 మంది, ఒడిశాలో ఐదు స్థానాలకు గాను 40 మంది, ఝార్ఖండ్​ లో మూడు స్థానాలకు గాను 54 మంది, జమ్మూకశ్మీర్​ లో ఒక స్థానానికి గాను 22 మంది, లడఖ్​ లో ఒక స్థానానికి గాను ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. మొత్తం 49 స్థానాలకు గాను 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

2019లో ఈ 49 సీట్ల ఫలితాలు ఎలా ఉన్నాయి?

బీజేపీ 32 స్థానాల్లో గెలుపు సాధించింది. శివసేన 7, టీఎంసీ 4, ఇండిపెండెంట్​ 1, నేషనల్​ కాన్ఫరెన్స్​ 1, జేడీయూ 1, బీజేడీ 1, ఎల్జేపీ 1 స్థానాల్లో గెలుపొందాయి. సింహాభాగం సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. 
 

2019లో ఓటింగ్ శాతం.. 

పశ్చిమ బెంగాల్ లో 80.13శాతం పోలింగ్​ నమోదైంది. లడఖ్ లో  71.05 శాతం, ఒడిశాలో 67.31 శాతం, ఝార్ఖండ్ లో 65.56 శాతం, ఉత్తర ప్రదేశ్ 58.57 శాతం, బీహార్ 57.19 శాతం, మహారాష్ట్ర 55.67 శాతం, జమ్మూ కాశ్మీర్ లో 34.6 శాతంగా పోలింగ్​ నమోదైంది.