అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రతిభా పాటిల్​

భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఆస్పత్రిలో చేరారు. పూణేలోని భారతీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి నుంచి ప్రతిభా పాటిల్​ చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Mar 14, 2024 - 16:26
 0
అనారోగ్యంతో  ఆసుపత్రిలో చేరిన ప్రతిభా పాటిల్​

పూణే: భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఆస్పత్రిలో చేరారు. పూణేలోని భారతీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి నుంచి ప్రతిభా పాటిల్​ చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. గురువారం ప్రతిభా పాటిల్​ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు మెడికల్​ బుల్లెటిన్​ విడుదల చేశారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌కు రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్‌ చరిత్ర సృష్టించారు. 2007 నుంచి 2012 వరకు ప్రతిభా పాటిల్ పదవిలో ఉన్నారు. అంతకుముందు 2004 నుంచి 2007 రాజస్థాన్​లో గవర్నర్​గా పనిచేశారు ప్రతిభా పాటిల్​. 1991 లోక్​సభ ఎన్నికలో ఎంపీగా గెలుపొందారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ భర్త దేవీసింగ్‌ షెకావత్‌ (89) గతేడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. పూణే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు.  ప్రతిభా పాటిల్​కు కొన్నాళ్ల క్రితం మెక్సికో అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్​ ది అగ్విలా అజ్​టెకా' దక్కింది. మెక్సికో అంబాసిడర్ మెల్బా ప్రియా పూణేలోని రాయబార కార్యాలయంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.