మూడోసారి అధికారం
తొలి పర్యటన..
డోలు వాయించిన ప్రధాని
రెడ్ కార్పెట్ స్వాగతం
సింగపూర్ సిటీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటన ముగించుకొని బుధవారం మధ్యాహ్నం సింగపూర్ కు చేరుకున్నారు. ఇక్కడ ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ప్రధాని మోదీని సింగపూర్ వ్యవహారాలు, న్యాయ శాఖ మంత్రి కె. షణ్ముగం రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. అనంతరం లయన్ సిటీకి చేరుకున్న మోదీకి భారతీయులు జయ జయ ధ్వానాలు, డప్పులు, డ్యాన్సులు, నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మోదీకి రాఖీ కట్టారు. వినాయక చవితి శుభాకాంక్షలను తెలిపారు.
అనంతరం ప్రధాని మోదీని సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ స్వాగతం పలుకుతూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
యాక్ట్ ఈస్ట్ పాలసీకి మరింత బూస్ట్ కల్పించే చర్యలను ప్రధాని మోదీ తొలుత నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ విధానాన్ని మరింత పటిష్ఠ పరచాలనే ఉద్దేశ్యంతో పలుదేశాల్లో వరుస పర్యటనలు చేపడుతున్నారు. 2018 తరువాత సింగపూర్ లో మోదీ తొలిసారి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానిగా మూడోసారి ఎన్నికై సింగపూర్ కు వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఆసియాలో భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వనరుగా సింగపూర్ నిలుస్తోంది. ప్రధాని మోదీకి సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు ముందు ప్రధాని పలువురు సింగపూర్ మంత్రులను కలిశారు. పలువురు వాణిజ్య, వ్యాపార వేత్తలతో భేటీ అయ్యారు. మోదీ రెండు రోజుల సింగపూర్ పర్యటనలో గురువారం ప్రధానికి ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. అటు తరువాత సింగపూర్ అధ్యక్షుడితో భేటీ, వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
యాక్ట్ ఈస్ట్ పాలసీలో సెమీ కండక్టర్ ఉత్పత్తి పై దృష్టి సారించనున్నారు. ఇరుదేశాల ధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునే దిశగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
డోలు భాజే..
ప్రధాని మోదీ సింగపూర్ లోని హోటల్ వద్దకు చేరుకోగానే ప్రవాస భారతీయులు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. జయ జయ ధ్వానాలతో ఆయనపై ఉన్న అభిమానానికి సింగపూర్ లోని నాయకులు చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హోటల్ బయటే భారతీయ సాంప్రదాయ నృత్యాలతో ప్రధానికి స్వాగతం పలికారు. డోలు చప్పుళ్లతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వీటిని తిలకిస్తూ రెండు క్షణాల పాటు డోలు వాయించారు. ప్రధాని డోలు వాయిస్తుండగా అక్కడే ఉన్న ప్రవాస భారతీయులు ఆనందం వ్యక్తం చేశారు.