రాంచీ: ఝార్ఖండ్ లో 38 స్థానాలకు గాను రెండో విడత (చివరి) ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదైంది. నవంబర్ 13న తొలిదశ ఎన్నికలు నిర్వహించారు. ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్ డీఎ), అధికార జెఎంఎం (ఝార్ఖండ్ ముక్తి మోర్చా) నేతృత్వంలోని ఇండియా కూటమిలు పోటీలో ఉన్నాయి. ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయం 11 గంటల వరకు బొకారో 27.72, డియోఘర్ 32.84, ధన్‌బాద్ 28.02, దుమ్కా 33.05, గిరిది 31.56, డేవుడ్ 33.39, హజారీబాగ్ 31.04, జామ్తారా 33.78, పాకుడ్ 35.15, రామ్‌ఘర్ 33.45, రాంచీ 34.75, సాహెబ్‌గంజ్ 30.90శాతం నమోదైంది.
ఝార్ఖండ్ ఎన్నికల ఇన్ చార్జీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు రోటి, మటి, బేటీ (తిండి, భూమి, కూతురు) కోసమే అన్నారు.ఉద్యోగాల పేరుతో జెఎంఎం, కాంగ్రెస్ లు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ర్టంలో మహిళలకు గౌరవం దక్కడం లేదని, వారిపై దాడులు, అఘాయిత్యాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. చొరబాటుదారులు మన ఆడబిడ్డల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ర్ట ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరించడం తగదన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. ఝార్ఖండ్ లో బీజేపీ అధికారంలోకి రాగానే భవిష్యత్ ను మారుస్తామన్నారు.
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యలన్నీ ప్రజల్లోకి వెళ్లాయని వాటిని తీర్చే సత్తా బీజేపీకే ఉందన్నారు. మూడింట రెండు వంతుల ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ ధన్వార్ నుంచి ఓటు వేశారు. ఈ ఎన్నికలు రాష్ర్ట భవితవ్యాన్ని మార్చేవన్నారు.