భారత్‌ అభివృద్ధి చెందుతుంటే.. మనం ఇంకా అడుక్కుంటున్నాం

జమియత్​ ఉలేమా–ఎ–ఇస్లాం అధ్యక్షుడు రెహ్మాన్​

Apr 30, 2024 - 13:32
Apr 30, 2024 - 16:02
 0
భారత్‌ అభివృద్ధి చెందుతుంటే.. మనం ఇంకా అడుక్కుంటున్నాం
  • పాక్​ ప్రతిపక్ష నేత మౌలానా ఫజ్లుర్​ రెహ్మాన్​
  • ఇండియా సూపర్​ పవర్​ కోసం కలలు కంటుంటే..
  • పాక్​ మాత్రం దివాలా తీయకుండా వేడుకుంటున్నది
  •  జాతీయ అసెంబ్లీలో  జేయూఐఎఫ్​ చీఫ్​ కామెంట్స్​
 
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు, జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, జేయూఐఎఫ్​ చీఫ్​ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్‌ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. పరోక్షంగా భారత్​ గురించి ఆయన ప్రస్తావిస్తూ‘‘పొరుగు దేశంతో మనల్ని పోల్చుకోండి. రెండూ ఒకే రోజు స్వాతంత్ర్యం పొందాయి. కానీ, నేడు వారు సూపర్ పవర్ కావాలని కలలు కంటున్నారు. మనమేమో దివాలా తీయకుండా ఉంటే చాలని ప్రయత్నిస్తున్నాం” అని పాక్‌ ఆర్థిక పరిస్థితిపై వ్యాఖ్యానించారు. తమ దేశం దివాలా తీయకుండా ఉండేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐ.ఎం.ఎఫ్‌)ని వేడుకుంటోందన్నారు.
గతంలో నవాజ్​ కూడా..
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ సైతం గతంలో ఇదే విధంగా భారత్‌ అభివృద్ధిని కొనియాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ వైపు వారు చంద్రయాన్‌లు, జీ20 సమావేశాలు జరుపుతుంటే..పాక్‌ మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటోంది. భారత్‌ వలే అభివృద్ధిని పాక్ ఎందుకు సాధించలేకపోయింది. దీనికి బాధ్యులు ఎవరు?’’అని అప్పట్లో ఆయన ప్రశ్నించారు.
రుణాల కోసం..
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్‌కు మరో 1.1 బిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎగ్జిక్యూటివ్ బోర్డు మంగళవారం ఆమోదముద్ర వేసింది. 3 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై పాకిస్థాన్‌, ఐఎంఎఫ్‌ మధ్య జరిగిన ఒప్పందం ఈ నెలతో ముగియనుంది. ఈ క్రమంలోనే చివరి విడతగా రుణాన్ని మంజూరుచేసేందుకు అంగీకారం లభించింది. కాగా.. ఒప్పందంలో భాగంగా ఇప్పటికే పాక్‌ రెండు విడతల్లో 1.9 బిలియన్‌ డాలర్లను అందుకుంది.