గాంధీనగర్: తాను ఉన్నంత కాలం ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, జనరల్ కేటగిరీలకు ఇచ్చే రిజర్వేషన్లను ఎవ్వరూ తీసివేయలేరని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గుజరాత్ పుణ్యభూమి తనకు సంస్కారం నేర్పిందన్నారు. ఈ పుణ్యభూమిలో జన్మించిన తాను ప్రజాతీర్పుతో నేడు హస్తినలో కూర్చోగలిగానని మోదీ తెలిపారు.
గుజరాత్ లో రెండు రోజుల పర్యటన సందర్భంగా బుధవారం మొదటిరోజు బనస్కాంతలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
మత ప్రాతిపదికన, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, వెనుకబడిన తరగతులకు ఇస్తున్న రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ స్వయంగా కోరుతోంది. కర్ణాటకలో ముస్లింలందరినీ రాత్రికి రాత్రే ఓబీసీగా ప్రకటించి 5 శాతం రిజర్వేషన్లు కూడా కల్పించారు. ఫేక్ వీడియోలతో ప్రజామద్ధతును కూడగట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. చివరికి ఆ వీడియోల్లో నిజం తెలిసి ప్రజలు కాంగ్రెస్ ను చీదరిస్తున్నారని పేర్కొన్నారు.
గుజరాత్ లో అన్ని స్థానాలను బీజేపీ మీ ఆశీర్వాదం వల్ల గెలవబోతోందని అన్నారు. సూరత్ లోక్ సభను ఇప్పటికే బీజేపీ ఖాతాలో వేసుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.
26 కులాలను ఓబీసీలుగా, మరాఠా, లింగాయత్ లను కాంగ్రెస్ అంగీకరించన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా పెట్టగలిగారని అన్నారు.
స్వాతంత్రం వచ్చాక రామ మందిరం నిర్మించాల్సి ఉన్నా కాంగ్రెస్ అవకాశ వాదం వల్ల నిర్మాణం కాలేదన్నారు. తాము అన్ని అడ్డంకులను అధిగమించి రామాలయాన్ని నిర్మించామన్నారు.
బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం రైళ్లు, రోడ్లు, విమానాశ్రయాలు నిర్మించే పనులు చేపడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలతో ప్రజలను మభ్య పెడుతూ ఓట్లు దండుకునే ప్రయత్నాన్ని చేస్తుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పదేళ్లలో ఖర్చు చేసిన ఖర్చును నేడు మనం ఒక్క సంవత్సరంలో ఖర్చు చేస్తున్నామని అన్నారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు.
దేశ కీర్తి ప్రతిష్ఠలు, నిరుపేదల సంక్షేమం కోరుకోని వారికి ఓట్లు వేసి వృథా చేసుకోవద్దని అన్నారు.
దేశంలో మహిళా, రైతు, యువ శక్తిని ప్రోత్సహించే అనేక కార్యక్రమాలను చేపట్టామని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధిలో మహిళలను కీలకంగా తీర్చిదిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదే అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.