విదేశాల్లో క్రియాశీలకంగా 13వేలమంది
దేశంలోని డీఈసీలకు అక్కడి నుంచి నిధులు
ఈడీ, ఎన్ ఐఏ దాడులు, ఆస్తుల జప్తు
వైమానిక, గెరిల్లా దాడులకు వ్యూహం
టెలికమ్యూనికేషన్, సామాజిక మాధ్యమాల వినియోగం
సమాంతర ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) భారత్ లో అంత్యర్యుద్ధాన్ని ప్రారంభించాలని భారీ కుట్రలు పన్నింది. ఈ విషయాన్ని భారత దర్యాప్తు సంస్థలతోపాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. 13వేల మంది పీఎఫ్ ఐ క్రియాశీల సభ్యులు విదేశాలలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని గుర్తించింది. వీరంతా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి భారత్ లోని పలు ప్రాంతాల్లో స్లీపర్ సెల్ సభ్యులకు ఆర్థిక సహయం చేస్తున్నట్లు గుర్తించింది.
పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్, సింగపూర్, గల్ఫ్ ఇంకా అనేక దేశాలలో పీఎఫ్ ఐకి చెందిన 13వేల మంది క్రియాశీల సభ్యులు ఉన్నట్లు గుర్తించింది. వీరంతా భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా స్థాపించేందుకు పెద్ద యెత్తున కుట్ర పన్నినట్లు పలు ఆధారాలను సేకరించాయి. గత మూడేళ్లలో ఈడీ 26 మందిని అరెస్టు చేసింది. రూ. 94 కోట్లను స్వాధీనం చేసుకుంది. పీఎఫ్ ఐకి చెందిన 35 చర, స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. వీటి విలువ రూ. 57 కోట్లు ఉంటుంది. పీఎఫ్ ఐకి చెందిన అనేక ట్రస్ట్ లు, ప్రైవేట్ ఆస్తులను కూడా కలిగి ఉన్నట్లు గుర్తించింది. హవాలా రాకెట్ ద్వారా భారత్ కు నిధులను పంపిస్తున్నట్లు గుర్తించింది.
ఇతరదేశాలలో ఉన్న పీఎఫ్ ఐ సభ్యులు నిధులను వివిధ మార్గాల ద్వారా సేకరించి భారత్ లోని జిల్లా కార్యనిర్వాహక కమిటీ (డీఈసీ)కి పంపుతున్నట్లు గుర్తించింది. ఈ సంస్థ భారత్ లో ఉన్న పీఎఫ్ ఐ స్లీపర్ సెల్ ల ద్వారా ఉగ్రకుట్రలు పన్నుతున్న వారికి గుట్టుచప్పుడు కాకుండా అందిస్తోంది. అనంతరం భారత్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఈ నిధులను వినియోగిస్తున్నట్లుగా ఈడీ, ఎన్ ఐఏలు గుర్తించాయి. ఈ సంస్థ లపై దాడులు చేసి దర్యాప్తు సంస్థలు పలు సాక్ష్యాలను సేకరించి దిమ్మతిరిగే నిజాలను కనుగొన్నారు. భారత్ ను ఇస్లామిక్ రాజ్యాంగం రూపొందించాలని, భారత ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని, భారతీయుల్లో విద్వేశాలను రగుల్చాలని తద్వారా తమ లక్ష్యాన్ని సాధించాలనే పలు ఆధారాలు లభ్యమయ్యాయి. వైమానిక, గెరిల్లా దాడుల కోసం టెలికమ్యూనికేషన్ ను పీఎఫ్ ఐ పటిష్ఠం చేయాలని నిర్ణయించినట్లు గుర్తించారు. తమ లక్ష్యాలను సాధించుకునేందుకు సామాజిక మాధ్యమాలను కూడా వేదికలుగా ఉపయోగించుకోవాలని, చనిపోయిన వారి ఖాతాలను హ్యాక్ చేసి వారి ఖాతాల ద్వారా సమాచారాన్ని పంచుకోవాలని నిర్ణయించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ప్రస్తుత ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ భారత్ లో అలజడులు, విధ్వంసాలు సృష్టిస్తూ దేశ, విదేశాల్లో భారత్ ఇస్లామ్ కు వ్యతిరేకంగా చూపెడుతూ యుద్ధం ప్రకటించాలని పీఎఫ్ ఐ నిర్ణయించినట్లు భారత దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఏది ఏమైనా మోదీ ప్రభుత్వంలో దేశ విచ్ఛిన్నకర శక్తులపై ఉక్కుపాదం పడుతుండడంతో ఇలాంటి శక్తుల బండారం బట్ట బయలవుతోంది.