ఏకకాలంలో గుడుంబా స్థావరాలపై దాడులు
12 కేసులు నమోదు గుడుంబా రహిత జిల్లాగా మానుకోట: ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
నా తెలంగాణ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు గుడుంబా స్థావరాలపై బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల సందర్భంగా 12 కేసులు నమోదు చేశారు. రూ. 57,200 143 లీటర్ల నాటుసారా, 1930 లీటర్ల చక్కెర పాకం స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసినట్లు ఎస్పీ వివరించారు. దాడుల్లో 70మంది పోలీసులు పాల్గొన్నారని తెలిపారు.
జిల్లాలో ఎక్కడా గుడుంబా అమ్మకాలు జరపకూడదన్నారు. ఎవరైనా అక్రమంగా విక్రయాలు జరుపుతున్నట్లు తెలిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుడుంబా అలవాటు వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా అమ్ముతున్నట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మానుకోటను గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఎస్పీ సుధీర్ రాంనాథ్ స్పష్టం చేశారు.