శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కు ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేపట్టారు. పదేళ్ల తరువాత జేకెఎన్ సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం శ్రీనగర్ లోని షేర్ ఎ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అతనితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయనతోపాటు డిప్యూటీ సీఎంగా సురేంద్ర చౌదరి, మంత్రులుగా సకినా ఇట్టు, జావేద్ రాణా, జావేద్ అహ్మద్ దార్, సతీష్ శర్మ నలుగురు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎన్సీపీ శరద్ వర్గానికి చెందిన సుప్రియా సూలే, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, సీపీఐకి చెందిన డి రాజా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు హాజరయ్యారు.
ఇక నుంచి ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటి నుంచే మద్ధతు కొనసాగించనుంది. ఒమర్ కాంగ్రెస్ కు మంత్రి పదవి ఆఫర్ ఇచ్చినా కాంగ్రెస్ నిరాకరించింది. దీంతో ఇరు పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు మొదలైనట్లేనని భావిస్తున్నారు. జమ్మూకశ్మీర్ లో జేకేఎన్ సీ 42 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు సాధించాయి. కాంగ్రెస్ ఈ రాష్ర్టంలో ఘోర పరాజయాన్నే మూటగట్టుకుంది. బీజేపీ 29, జేపీసీ 1, సీపీఐఎస్ 1, ఆప్ 1, స్వతంత్రులు 7 గెలుపొందారు.
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రవీందర్ రైనా శుభాకాంక్షలు..
జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ- జమ్మూ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లాకు అభినందనలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో శాంతి నెలకొల్పేందుకు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి వారు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.