రెండోసారి కాంగ్రెస్​కు నోటీసులు

రూ. 1,745 కోట్లు కట్టాలన్న ఐటీశాఖ

Mar 31, 2024 - 20:47
 0
రెండోసారి కాంగ్రెస్​కు నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ రూ. 1,745 కోట్లు కట్టాలని ఐటీ శాఖ రెండోసారి ఆదివారం నోటీసులు జారీ చేసింది. దీంతో కాంగ్రెస్​ ఖంగు తింది. రెండు రోజుల క్రితమే రూ. 1,823 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్​ పార్టీలో తీవ్ర దుమారం రేగుతోంది. 2014–-15 నుంచి 2016–-17 సంవత్సరాలకు సంబంధించి రూ.1,745 కోట్లు కట్టాలని ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన రెండు నోటీసుల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ మొత్తం రూ. 3,567 కోట్ల చెల్లించాల్సి ఉంటుంది. 2014–-15 సంవత్సరానికి రూ. 663 కోట్లు, 2015–-16కు రూ.664 కోట్లు, 2016–-17కు రూ. 417 కోట్లు అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయ పార్టీలకు ఇచ్చే పన్ను మినహాయింపు ముగిసినందున ఆ పార్టీకి చెందిన మొత్తం ఆదాయంపై పన్ను విధించినట్లు తెలిపాయి.

2017–-18 నుంచి 2020–-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి మొత్తం రూ.1,823 కోట్లకు పైగా చెల్లించాలని ఐటీ విభాగం శుక్రవారం కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేసింది. 2017 - 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలనను నిలిపేయాలన్న కాంగ్రెస్‌ పిటిషన్లను గురువారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన మరోసటి రోజే ఈ నోటీసులు ఇచ్చారు. కాగా, మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా రెండోసారి వరుస ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్​ పార్టీ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.