సంభాల్ హింస.. ఏ ఒక్కరినీ వదల!
అసెంబ్లీలో సీఎం యోగి వార్నింగ్
లక్నో: యూపీలోని సంభాల్ హింసలో పాల్గొన్న ఏ ఒక్కరిని వదిలేది లేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదన్నారు. 1947లో జరిగిన అల్లర్ల చరిత్రను వివరించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలపై సీఎం యోగి సంభాల్ చరిత్రను చెబుతూ విరుచుకుపడ్డారు.
1947 నుంచి సంభాల్‌లో 209 మంది హిందువులను హత్య చేశారన్నారు. ఈ రోజు సంభాల్‌లో చనిపోయిన వారి కోసం మొసలి కన్నీరు కారుస్తున్న వారు ఈ హిందువుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. 1947, 1948, 1958, 1962, 1976, 198, 198, 1990, 1996లో జరిగిన హింసలో ఎంతమంది హిందువులు సంభాల్ లో చనిపోయారో? కనీసం లెక్కలైనా తెలుసా అని ప్రశ్నించారు.
హిందువుల కాళ్లు నరికి మరీ చంపారన్నారు. ఇదేనా మత సామరస్యం అని నిలదీశారు. అలాంటి వారి పట్ల ఎలాంటి దయ, జాలి చూపబోమన్నారు. 46 యేళ్లుగా ఆలయం అక్కడ ఉంటే ఎందుకు తెరవనీయలేదని ప్రశ్నించారు. అంతగా హిందువులప అత్యాచారాలు, దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చుంటారా? అని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం హింసకు పాల్పడేవారికి వారి విధానంలోనే సమాధానం చెబుతుందన్నారు. ఆలయం, చుట్టుపక్కల 22 చారిత్రక బావులను మూసివేశారని అన్నారు.
యూపీ వివిధ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో 1970 నుంచి 78 వరకూ ఎంతోమంది హిందువులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులపై దాడులు జరిగితే పట్టించుకోని పార్టీలు ఏం ముఖం పెట్టుకొని అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సంభాల్ హింసలో పాల్గొన్న ఎవ్వరినైనా హై కోర్టు ఆదేశాలను పాటిస్తూనే శిక్షిస్తామని వారిని వదిలేది లేదన్నార. యూపీలో హింసకు తావు లేదన్నారు.