నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నాగరి సమాజంలో కుమార్తెలు, సోదరీమణులపై అఘాయిత్యాలపై రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోల్ కతాలో మెడికో విద్యార్థినిపై దారుణమైన అత్యాచారం, హత్యపై రాష్ర్టపతి బుధవారం స్పందించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలకు తక్షణమే నిర్ణయాత్మకమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై తనకు ఎంతో బాధేసిందని, తీవ్రంగా భయపడ్డానని అన్నారు. ఇక ఇలాంటి చర్యలను భారత సమాజం ఆమోదించదన్నారు. ఇలాంటి ఘటనలు అనేకమంది దేశ వాసుల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగులుస్తున్నాయని ముర్మూ ఆవేదన వ్యక్తం చేశారు. హింసకు కారణాలపై ఆత్మపరిశీలన అవసరాన్ని ముర్మూ నొక్కి చెప్పారు. లోపాలను సరిదిద్దుకోవాలన్నారు. సమాధానం కనుగొనాల్సిన కీలక సమయం ఆసన్నమైందన్నారు. నిర్భయ కేసును కూడా రాష్ర్టపతి గుర్తు చేశారు. అప్పటి నుంచి సమాజాన్ని పట్టి పీడీస్తున్న ఈ దుష్టచారాన్ని పాతిపెట్టాల్సిన అవసరం ఉందని రాష్ర్టపతి అన్నారు. స్త్రీలను తక్కువగా చూసే సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో మహిళల భద్రత మనందరి బాధ్యత అని ద్రౌపదీ ముర్మూ తెలిపారు.