రాంచీ: ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేదే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. మదన్ మోహన్ మాలవ్యా వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.
అవినీతి నేతలను ఉరితీయాలి!..
మంగళవారం ఝార్ఖండ్‌లోని ఝరియా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, జేఎంఎం ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతిపరులైన ఝార్ఖండ్ అవినీతి, కుంభకోణాల నాయకులను తలకిందులుగా ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు అవినీతి, బొగ్గు అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపించారు. వారికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలన్నారు. ఓటర్లు బీజేపీని బలోపేతం చేస్తే వీరి అనైతిక చర్యలకు సరైన రీతిలో బుద్ధి చెబుతామన్నారు.
చొరబాటుదారులను వెళ్లగొడతాం..
అక్రమ చొరబాటుదారులను వెళ్లగొడతామన్నారు. దళితులు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు రద్దు చేసి ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ కుటీల ప్రయత్నానికి తెరతీసిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఉన్నంతవరకూ రిజర్వేషన్లను ముట్టలేరన్నారు. రాష్ర్ట భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొనే ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు.
దోచుకున్నదంతా వెనక్కి తీసుకుంటాం..
నిరుపేద మహిళలు కూడా లక్షాధికారులుగా ప్రధాని తీర్చే దిద్దే బాధ్యతను భుజాలకెత్తుకున్నారని తెలిపారు. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం అవినీతిని అందరూ కళ్లారా చూశారని అన్నారు. వారి ఇళ్లలో వందల కోట్ల రూపాయలు పట్టుబడ్డాయన్నారు. అదంతా ఝార్ఖండ్ నిరుపేదలదే అన్నారు. వీరందరిని తలకిందులుగా వేలాడదీస్తామన్నారు. వారి నుంచి దోచుకున్న ప్రతిపైసా వెనక్కి తీసుకువస్తామన్నారు. జెఎంఎం, కాంగ్రెస్ ప్రభుత్వాలది ఎక్కడ చూసినా కుంభకోణాలు, భూముల ఆక్రమణలు, అక్రమ నగదు కలిగి ఉండడం రాహుల్ బాబా, ఖర్గే పార్టీలకు పరిపాటిగా మారిందన్నారు. వీరిని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.