పాలన అస్తవ్యస్తంగా మారింది
అసమర్థ ముఖ్యమంత్రికి రేవంత్ ఉదాహరణ
బీజేపీపై లేనిపోని అభాండాలు
ప్రధాని దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారు
11 నెలల్లో ఏం సాధించరో చెప్పాలి
అన్ని వర్గాలను మోసం చేశారు
సొంత ప్రజలే తిట్టుకుంటున్నారు
మహిళా విజయోత్సవాలు చేసుకునే అర్హత ఎక్కడిది?
ప్రధాని తిడితే కిరీటం వచ్చిందా
మహిళలు గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదు
మహిళలను వంచించిన సభ: బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి
అపజయోత్సవాలు చేసుకోవాలి: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
నా తెలంగాణ, హైదరాబాద్: దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నరేంద్ర మోదీ పేరు కూడా ఉచ్చరించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారత్ ను ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు మోదీ అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని విధాలుగా మోసం చేసింది. కాంగ్రెస్ వి ప్రజా పాలన విజయోత్సవాలు కాదు.. ప్రజా వంచన ఉత్సవాలు. ఒక అసమర్థుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే రాష్ట్రం ఏ రకంగా దివాళా తీస్తుందో.. పాలన అస్తవ్యస్తంగా మారుతుందో... రేవంత్ రెడ్డిని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ నెరవేర్చలేదు... ప్రజలకు చెప్పుకునేది ఏమీ లేదు. అందుకనే కాంగ్రెస్ విజయోత్సవాల సభలో.. రేవంత్ రెడ్డి ఏదోరకంగా ప్రతిపక్షాలపై దాడి చేయాలనే ఉద్దేశంతో..... ప్రధాని నరేంద్ర మోదీపై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై అభాండాలతో విరుచుకుపడ్డారు.
కిషన్ రెడ్డి మోదీకి బానిస అంటూ విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి... అసలు ఆయన ఎవరికి బానిసో గుర్తుతెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి.. అదే సభలో సోనియా గాంధీ కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకుంటానని వ్యాఖ్యానించాడు. ఆయన ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు కాబట్టే.. సోనియా గాంధీ కాళ్లు కడిగి ప్రసన్నం చేసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోనియా గాంధీని బలిదేవత అని సంబోధించి.. ఈరోజు తన పదవిని కాపాడుకోవడం కోసం సోనియా కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకుంటానని వ్యాఖ్యానిస్తున్నరంటే ఎంతకు దిగజారారో తెలుస్తున్నది. 'ఖబడ్దార్ రేవంత్ రెడ్డి... అవినీతిలో కూరుకుపోయిన మీరు... నరేంద్ర మోదీ గురించి బీజేపీ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. పునర్విభజన చట్టం విషయంలో బీజేపీ గురించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని హెచ్చరిస్తున్నాం. రేవంత్... ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ప్రజల్లో అభాసుపాలు కావొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశారో, ఏం సాధించారో ప్రజలకు తెలియజేయాలి. రాజకీయాల్లో అవకాశవాదాలకు నిలువెత్తు నిదర్శనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యువత, రైతులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా.. రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని విజయోత్సవాలు జరుపుకుంటున్నట్లు? ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి.. ఎగవేతల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం 6 గ్యారంటీలపై పెట్టి, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిండు. బాండ్ పేపర్ తో ప్రజల్లోకి వెళ్లిండు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించని అసమర్థ సీఎం. రేవంత్ సొంత నియోజకవర్గంలో ఫార్మాసిటీ పేరుతో గిరిజన బిడ్డలు, రైతుల భూములు గుంజుకోవడానికి చేస్తున్న అరాచకాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. లంకెబిందల కోసం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలను హింసిస్తున్నాడు. ఆయా శాఖలవారీగా నెరవేర్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. దీనిపై ఎక్కడ చర్చించేందుకైనా రెడీ.
మహిళాల గురించి మాట్లాడే హక్కు లేదు: బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి
ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, మహిళల సాక్షిగా మహిళలను వంచించి పెట్టిన సభ. అడ్డెడు పాలాలు బుక్కిన ఆకలి తీరదన్నట్లు.. అడ్డమైన తిట్లు తిట్టినంత మాత్రాన పరిపాలన చేసినట్లు కాదు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోయే సామెత. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, దాడులు చేస్తున్న పరిస్థితి. మహిళల రక్షణ కోసం సమీక్ష చేసేందుకు హోంమంత్రి కూడా దిక్కులేని పరిస్థితి దాపురించింది. హోంమంత్రి లేని రాష్ట్రంలో తెలంగాణలో మహిళలకు రక్షణ ఎట్ల ఉంటది? అలాంటి పరిస్థితుల్లో.. మహిళా విజయోత్సవాలు చేసుకునే అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడిది? అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వంటి నాయకులు డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చారు. మహిళా డిక్లరేషన్ చేశారు. డిగ్రీ చదువుకునే ఆడబిడ్డలందరికీ స్కూటీ ఇస్తామన్నారు. ఈరోజు వరకు ఎందుకివ్వలేదు. పెండ్లి చేసుకునే ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఎందుకివ్వలేదు? స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని ఋణం పరిమితిని రూ. 10 లక్షల వరకు పెంచుతామని చెప్పారు. ఇంకా ఎందుకు పెంచలేదు? దేశంలో ఆడబిడ్డలు ఆనారోగ్యానికి గురికావొద్దని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మరుగుదొడ్లను నిర్మించిన పార్టీ బీజేపీ. 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మహిళల సంక్షేమం పట్ల సోయి లేకుండా పాలించడం సిగ్గు చేటు. కేంద్ర కేబినెట్ లో 12 మంది మహిళలకు, ఈ కేబినెట్ లో ఏడుగురు మహిళలకు కేంద్రమంత్రి పదవులు కట్టబెట్టింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కేబినెట్ లో కేవలం ఇద్దరు మహిళలకు మాత్రమే మంత్రి పదవులిచ్చి, మహిళల పార్టీ కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటు.
అబద్ధాల ప్రచారం: బీజేపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిందో.. ఆ హామీలు నెరవేర్చకుండా మళ్లీ ఇప్పుడు అదే చోట నుంచి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అపజయోత్సవాలు చేసుకోవాల్సిందిపోయి.. విజయోత్సవాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా.. 6 గ్యారంటీల అమలు గురించి ప్రజలకు స్పష్టతనివ్వాలి. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 7500 పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇంతవరకు రెండు సీజన్లు గడిచిపోయాయి. ఇచ్చింది లేదు.
64 లక్షల మంది రైతులకు ఋణమాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 22 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి.. భద్రకాళి అమ్మవారిపై, సమ్మక్క అమ్మవారిపై ఒట్లు పెట్టి హామీలిచ్చిన్రు. అమలు చేయకుండా మోసం చేశారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్ ను స్మార్ట్ సిటీగా ప్రకటించి నిధులు కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలే. అభివృద్ధి పనులు పూర్తిచేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగాలు ఇవ్వకుండానే.. ఇచ్చామని చెప్పుకుంటున్నది. కేవలం ప్రజలను మోసం చేయడమే కాదు.. దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది.