గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నాబార్డ్ సహాయం
పార్లమెంట్ లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నా బార్డ్ ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని, దీంతో 6.29 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పార్లమెంట్ కు సోమవారం లిఖిత పూర్వక సమాధానం అందజేశారు. గడిచిన 18యేళ్లలో నా బార్డ్ ద్వారా 1029 ప్రాజెక్టులను మంజూరు చేశామన్నారు. దీంతో గిరిజన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను అందించామన్నారు. దేశవ్యాప్తంగా నా బార్డ్ ద్వారా గిరిజనుల అభివృద్ధికి 2.9 కోట్ల చెట్లను నాటించామన్నారు. 2005లో టీడీఎఫ్ పథకాన్ని ప్రారంభించామని ఈ పథకం ద్వారా 6.29 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. దేశంలో చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ ఋణాలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. గత మూడేళ్లలో చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ రుణాల ఖాతాల సంఖ్య 2023–-24లో 13.06 కోట్లకు పెరిగిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.