కాంగ్రెస్​ తో– మహారాష్ట్ర ఎస్పీ, టీఎంసీలు దూరం దూరం

Congress and Maharashtra SP and TMC are far apart

Dec 9, 2024 - 16:16
 0
కాంగ్రెస్​ తో– మహారాష్ట్ర ఎస్పీ, టీఎంసీలు దూరం దూరం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్​ బయట కాంగ్రెస్​ నిరసనల్లో మహారాష్ట్ర ఎస్పీ, టీఎంసీ ఎంపీలు సోమవారం గైర్హాజరయ్యారు. గత కొంతకాలంగా కాంగ్రెస్​– మహారాష్ట్ర ఎస్పీ, టీఎంసీల మధ్య అంతర్గతంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయి. ఈ ఇరు పార్టీల ఎంపీలు ఇండి కూటమి నాయకుడిగా రాహుల్​ ను ఒప్పుకోమని బహిరంగంగానే పేర్కొన్నారు. మమత బెనర్జీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉంది. గతం నుంచే కాంగ్రెస్​ పార్టీ చేస్తున్న నిరసనలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. అదే సమయంలో బంగ్లాదేశ్​ లో భారతీయులపై జరుగుతున్న దాడుల అంశాన్ని కూడా లేవనెత్తాలని ఆమె కోరుకుంటోంది. మరోవైపు శివసేన (ఆదిత్యఠాక్రే) వర్గం నేత అయోధ్య రామ మందిర నిర్మాణం, బాబ్రీ మసీదు కూల్చివేతపై హర్షం వ్యక్తం చేస్తూ సోషల్​ మీడియాలో పోస్టు చేయడం పట్ల మహారాష్ట్ర ఎస్పీ ఎంపీలు విబేధించారు. దీంతో కాంగ్రెస్​–మహారాష్ర్ట ఎస్పీ, టీఎంసీల మధ్య నివురు గప్పిన నిప్పులా పరిస్థితులున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎస్పీ పార్టీ 12 సీట్లు డిమాండ్​ చేయగా కేవలం ఐదు సీట్లను మాత్రమే కాంగ్రెస్​ కేటాయించింది. ఎన్నికలు దగ్గరపడ్డాక ఈ సీట్లను కూడా రద్దు చేసి కేవలం రెండు స్థానాలను మాత్రమే కేటాయించింది. మరోవైపు మహారాష్ట్ర ఎస్పీ ప్రకటనపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ కూటమిలో భాగమేనన్నారు. తమ పార్టీలో అఖిలేష్​ యాదవ్​ కీలక నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఏది ఏమైనా శివసేన భిన్న ప్రకటనపై యూపీ ఎస్పీ పార్టీ గుర్రుగా ఉంది.