వైద్య విద్యార్థిని హత్య.. సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నం
Murder of medical student.. Attempt to tamper with evidence
అర్థరాత్రి ఆందోళన
ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో విధ్వంసం
సీఎం మమత ప్రభుత్వంపై విపక్షాల ఆగ్రహం
కోల్‌కతా: విద్యార్థులు, బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా వైద్య విద్యార్థిని హత్య కేసులో సాక్ష్యాలను తారుమరు చేసేందుకు ప్రయత్నం జరిగింది. బుధవారం అర్థరాత్రి ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో వందలాది మందిగా దుండగులు చొరబడి తీవ్ర విధ్వంసానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలోని వస్తువులు, టేబుళ్లు, కుర్సీలు, కిటికీలు, పరికరాలు అన్నింటినీ ధ్వంసం చేశారు. ఆసుపత్రి బయట వైద్య విద్యార్థులు ఏర్పాటు చేసిన దీక్షా స్థలాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. వైద్యవిద్యార్థులు పెద్ద పెట్టున నిరసనగా దిగగా వారి ముసుగులో కొందరు దుండగులు చొరబడి శాంతియుత ఆందోళనను కాస్త విధ్వంసంగా మార్చడంలో సఫలమయ్యారు.
విషయం తెలుసుకున్న పోలీసులు భారీ ఎత్తున రంగంలోకి దిగి ఆందోళనకారుపై టీయర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టారు. అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో కోల్ కతా పోలీస్ చీఫ్ వినీత్ గోయల్ ఆసుత్రి వద్దకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆసుపత్రిలోనూ, బయట ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. గురువారం ఉదయం వినీత్ గోయల్ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థి హత్య జరిగిన ప్రాంతంలో ఆందోళనకారులు వెళ్లలేదన్నారు. సాక్ష్యాలు తారుమారు కాలేదన్నారు. మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయొద్దని కోరారు. వదంతులను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనతో సీఎం మమత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చెలరేగాయి. ఇది టీఎంసీ పనేనని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది.