సినీ నటనాభి రాముళ్లు 

భారతీయ ఇతిహాసాల్లో శ్రీ రాముడుకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది.

Apr 16, 2024 - 16:27
 0
సినీ నటనాభి రాముళ్లు 

భారతీయ ఇతిహాసాల్లో శ్రీ రాముడుకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి, రాజు ఎలా పాలించాలి, భర్త ఎలా ఉండాలి, కొడుకుగా, అన్నగా.. ఇలా మన జీవితాల్లో ఏ పాత్ర తీసుకున్నా దానికి ఆదర్శంగా శ్రీ రాముడిని చూపిస్తాము. నేడు శ్రీ రామనవమి పండుగ. మరి రాముడి వంటి గొప్ప పాత్రని ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఏ ఏ నటులు పోషించారు ఒకసారి చూసేదం.

రాముడంటే ఎన్టీఆరే

తెలుగు వారికి శ్రీ రాముడు అన్నా, శ్రీ కృష్ణుడు అన్నా మొదటిగా గుర్తుకు వచ్చేది ‘సీనియర్ ఎన్టీఆర్’. తన హుందాతనంతో, రాజసంతో రాముడు అంటే ఇలానే ఉంటాడు ఏమో అనిపించేలా ఎన్టీఆర్ ఆ పాత్రని పోషించారు. అప్పుడే కాదు, ఇప్పటికీ కొంతమంది తమ ఇళ్లలో రాముడి ఫోటోగా ఎన్టీఆర్ ఫోటోనే పెట్టుకొని ఆరాధిస్తారు. శ్రీ రామ పట్టాభిషేకం, లవకుశ వంటి సినిమాల్లో పూర్తి స్థాయి రాముడి పాత్రతో పాటు పలు సినిమాల్లో కొంతసేపు రాముడిగా కనిపించి అలరించారు.

శోభన్ బాబు 

ఇక సీనియర్ ఎన్టీఆర్ తరువాత రాముడిగా అందరి మనసు దోచుకున్న సోగాడు ‘శోభన్ బాబు’. తన అందంతో ఒకప్పుడు ఆడపిల్లలకు కలల రాకుమారుడిగా ఉన్న శోభన్ బాబు.. సంపూర్ణ రామాయణం సినిమాలో రాముడిగా కనిపించారు. ఆ మూవీలో సీతగా చంద్రకళ నటించారు.

సుమన్

వీరిద్దరి తరువాత రాముడి పాత్రకి న్యాయం చేసింది హీరో ‘సుమన్’ . కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన శ్రీరామదాసు సినిమాలో రాముడి పాత్ర కోసం సుమన్ తీసుకున్నారు. ప్రేక్షకులు కూడా సుమన్ రాముడిగా అంగీకరించడంతో.. ఎన్టీఆర్, శోభన్ బాబు తరువాత రాముడి పాత్రలో మరొకర్ని ఉహించుకోలేని ఎంతోమంది మూవీ మేకర్స్ కి సుమన్ బెస్ట్ ఛాయస్ అయ్యాడు.

బాలకృష్ణ

 బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీ రామరాజ్యం సినిమాలో నందమూరి బాలకృష్ణ  రాముడి పాత్రలో కనిపించి సీనియర్ ఎన్టీఆర్ ని తలపించాడు. లవకుశ సినిమా కథతో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతగా నటించగా, శ్రీకాంత్  లక్ష్మణుడు పాత్రలో కనిపించాడు.

జూనియర్ ఎన్టీఆర్ 

మరో నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రాముడి పాత్రలో నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ ని రాముడి పాత్రతోనే మొదలు పెట్టాడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణం సినిమాలో ఎన్టీఆర్ రాముడి పాత్రని పోషించాడు. ఈ సినిమా నేషనల్ అవార్డుని కూడా అందుకుంది.

శ్రీకాంత్

అలాగే హీరో శ్రీకాంత్ ,కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన దేవుళ్ళు సినిమాలో కాసేపు రాముడిగా కనిపించి అలరించాడు. 

 ప్రభాస్ 

ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రని పోషించి మెప్పించారు ప్రభాస్. సీతగా కృతిసనన్ నటించింది.

ఈ మూవీపై వివాదాలు చాలానే వచ్చాయి. అయితే రాముడి పాత్ర, హనుమాన్ పాత్ర లు ఎంతో ఉదాత్తంగా చిత్రీకరించారు