మోదీ రోడ్ షో జనం నీరాజనాలు.. పూల వర్షం
సోమవారం రోడ్ షోలో మహిళా శక్తి ప్రధానంగా నిలిచింది.
వారణాసి: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో పూల వర్షం కురిపిస్తున్నారు. సోమవారం రోడ్ షోలో మహిళా శక్తి ప్రధానంగా నిలిచింది. మోదీ చేపట్టిన రోడ్ షోలో ఐదువేల మంది మాతృశక్తి మహిళలు హాజరయ్యారు. మోదీ రోడ్ షోకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద యెత్తున హాజరయ్యారు.
పూలవర్షం..
మోదీ చేపట్టిన ఈ రోడ్ షోకు ప్రత్యేకత ఉండడంతో ఐదుకిలోమీటర్ల మేర పూలవర్షం కురిపించడం విశేషం. ఈ కార్యక్రమంలో మోదీకి జయ జయ ధ్వానాలు, హర హర మహాదేవ్, కాశీ విశ్వనాథుని నామాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. మోదీ రోడ్ షోకు స్వాగతం పలికేందుకు పెద్ద పెద్ద భవంతులపై నిలుచొని పూలవర్షం కురిపించారు. ఆద్యంతం మోదీ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.
ప్రత్యేకతలు..
ఆదిశంకరాచార్యులు ప్రయాణించిన మార్గం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి విశ్వనాథ క్షేత్రం వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో 40 ఘాట్ లు, 257 దేవాలయాలు, 60 ఆశ్రమాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రముఖ సాధుసంతువులు 1500మంది ఉన్నారు. ఈ మార్గంలో మొత్తం 18 వేల వ్యాపార సముదాయాలు (దుకాణాలు) ఉన్నాయి. 23 వేల ఇళ్లు ఉన్నాయి.
కాగా 1200 సంవత్సరాల క్రితం ఇదే మార్గంలో ఆదిశంకరాచార్యులు నడయాడారని చెబుతారు.
ప్రముఖ స్థలాల వద్ద నుంచి రోడ్ షో..
యాత్ర మార్గంలో అస్సీ భదాయిని ప్రాంతంలో గోస్వామి తులసీదాస్ కార్యస్థలంగా చెబుతారు. రాణి లక్ష్మీబాయి జన్మస్థలం కూడా ఇక్కడే ఉంది. సత్య హరిశ్చంద్ర ఘాట్ వద్ద స్వామి కరపత్రి మహారాజ్ ఆశ్రమం ఉంది. మా ఆనందమయి ఆశ్రమం, శివాల వద్ద మా అన్నదా, జైన మతానికి చెందిన తీర్థంకరుని ఆలయాలు కూడా ఉన్నాయి. ముస్లింల ప్రాబల్యం ఉన్న మదనపుర ప్రాంతంలో బనారసీ చీరల పెద్ద వ్యాపారం ఉంది. ఇక్కడ నుంచ కూడా ప్రధాని రోడ్ షో కొనసాగింది.
ప్రధాని రోడ్ షో నిర్వహించే మార్గం అత్యంత శుభప్రదమైందని కాశీ విద్వత్ పరిషత్ అధ్యక్షుడు వశిష్ట త్రిపాఠి మహర్షి పేర్కొన్నారు. ఈ నేలపై నడయాడిన వారు ఓటమనేది ఎరుగన్నారు. అన్ని రకాల శత్రు బాధల నుంచి విముక్తులవుతారని పేర్కొన్నారు. కాగా ప్రధాని యాత్ర సందర్భంగా ఆద్యంతం పూలతో స్వాగతం పలికేందుకు సాదు సంతువులు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. మరో మహాపురుషునిగా మోదీని భావిస్తున్నట్లు తెలిపారు.