కిసాన్ సమ్మాన్ విడుదలపై మోదీ తొలి సంతకం
రూ. 20వేల కోట్లు విడుదల నిరుపేదలకు రెండు కోట్ల గృహాలు సాయంత్రం 5 గంటలకు మోదీ కేబినెట్ భేటీ మంత్రిపదవులపై రానున్న స్పష్టత
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి విడుదలకు ప్రధాని నరేంద్ర మోదీ తొలిరోజు తొలి సంతకం చేశారు. మోదీ మూడవసారి ప్రధానిగా అధికారం చేపట్టాక సోమవారం ఢిల్లీలోని పీఎంవో కార్యాలయానికి ఉదయం 10 గంటలకు చేరుకున్నారు. రూ. 20,000 కోట్లను విడుదల చేశారు. దీంతో దేశంలోని 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రానున్న సమయంలో రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి మరింత ప్రోత్సాహం ఇచ్చే చర్యలను తీసుకోనున్నట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి. అదే సమయంలో దేశంలోని 2 కోట్లమంది నిరుపేదలకు గృహాలు కేటాయించాలని ప్రధాని నిర్ణయించినట్లు తెలిపాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణకు ప్రధాని మోదీ తొలిరోజు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు.
సాయంత్రం 5 గంటలకు మోదీ అధ్యక్షతన కేబినెట్ మంత్రిమండలి భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఎవరెవరికి ఏయే పదవులు ఇవ్వాలనేది నిర్ణయించనున్నారు. ప్రధాని తొలిరోజంతా బిజీబిజీగానే గడపనున్నట్లు స్పష్టం అవుతోంది.
మూడోసారి ఏర్పాటైన మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో క్యాబినెట్‌లో ముగ్గురు మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్‌డీ కుమారస్వామిలు హాజరుకానున్నారు. నిర్మలా సీతారామన్, అన్నపూర్ణా దేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంభానియా, అప్నాదళ్ సోనేలాల్ ఎంపీ అనుప్రియా పటేల్‌తో సహా ఏడుగురు మహిళా మంత్రులు కూడా మోదీ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. వీరితోపాటు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ లు హాజరవుతారు.
కాగా మోదీ తొలిరోజు పీఎంవో కార్యాలయానికి చేరుకోవడంతో పీఎంవో ఉద్యోగులు ప్రధానికి చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు. మరోమారు ప్రధానిగా మోదీ ఎన్నిక కావడం ఆనందదాయకమని, హర్షణీయమన్నారు.