ఇండోనేషియాలో అగ్నిపర్వతం విస్ఫోటనాలు
సురక్షిత ప్రాంతాలకు 11వేల మంది తరలింపు రింగ్ ఆఫ్ ఫైర్ వల్లే తరచూ పేలుళ్లన్న జియోలాజికల్
న్యూఢిల్లీ: ఇండోనేషియాలోని రుయాంగ్ పర్వతంపై బుధవారం నుంచి అగ్నిపర్వత విస్ఫోటనాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. గురువారం కూడా విస్ఫోటనాలు జరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే విస్ఫోటనాలు మంగళవారం రాత్రి నుంచే జరుగుతున్నా బుధవారం నుంచి తీవ్రతరమైనట్లు అధికార వర్గాలు గుర్తించారు. రువాంగ్ ప్రాంతాల్లో నివసిస్తున్న 11 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాశ్రయాన్ని మూసివేశారు. లావా, బూడిద పెద్ద యెత్తున వెలువడుతుండడంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
రువాంగ్ పర్వతంపై తరచూ పేలుళ్లు జరుగుతుంటాయని అధికార వర్గాలు వివరించారు.
ఇటీవల సంభవించిన భూకంపం వల్లే ఇక్కడి టెక్టోనిక్ ప్లేట్లు అస్థిరంగా మారాయని, ఇవే అగ్నిపర్వత విస్ఫోటనాలకు కారణమవుతున్నాయని అధికారులు వివరించారు. అగ్ని పర్వతం సమీపంలోని ఆరు కిలోమీటర్ల వరకు ప్రత్యేక జోన్ గా ప్రకటించి అందరిని ఖాళీ చేయించారు.
ఇండోనేషియాలో 120 చురుకైన అగ్నిపర్వతాలున్నట్లు జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ఇండోనేషియా 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ తరచూ అగ్నిపర్వతాలు పేలుతుంటాయని అధికారులు వివరించారు.