తెలంగాణలో మోదీ ఫినిషింగ్ టచ్
–17 స్థానాలు కవరయ్యేలా 2 రోజుల ప్రచారం
- నేడు సాయంత్రం హైదరాబాద్ కు మోదీ
- రేపు జిల్లాల్లో పర్యటించనున్న ప్రధాని
- 10న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సభలు, రోడ్ షోలు
- చివరి 4 రోజుల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పీఎం టూర్
- ఇప్పటికే బీజేపీకి సానుకూల వాతావరణం
- మోదీ పర్యటనతో మెజార్టీ సీట్ల సాధన దిశగా కమలం పార్టీ
నా తెలంగాణ, డైనమిక్ బ్యూరో:
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్నది. ఇప్పటికే ప్రచారంలో ముందు ఉన్న బీజేపీ.. చివరి నాలుగు రోజులను సమర్థంగా వినియోగించుకునేందుకు సర్వం సిద్ధం చేసింది. నాలుగు రోజుల్లో రెండు రోజుల పాటు ప్రధాని మోదీ17 స్థానాలను కవర్ చేస్తూ.. తెలంగాణలో బీజేపీ ప్రచారానికి ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు. దీంతో ఇప్పటికే కమలం పార్టీకి సానుకూలంగా ఉన్న వాతావరణం మరింత బలపడి ఆ పార్టీకి మెజార్టీ సీట్లు తీసుకొస్తాయని పార్టీ నాయకత్వం భావిస్తున్నది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి పార్టీకి జనాల్లో ఉన్న మద్దతు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అప్రమత్తంగా ఉంటూ ఇంకొంచెం కష్టపడితే12 నుంచి15 సీట్లు సాధించవచ్చనే అభిప్రాయాలు వెలిబుచ్చారు. తుది దశలో మోదీ ప్రచారంతో బీజేపీకి మరింత లాభం జరిగే ఆస్కారం ఉన్నది.
జిల్లాల్లో విస్తృత పర్యటన
మంగళవారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని రాత్రి రాజ్ భవన్ లో బస చేసి బుధవారం ఉదయం జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్ లలో పాల్గొనబోతున్నారు. రెండు లోక్ సభ నియోజకవర్గాలను కలుపుతూ కనీసం నాలుగు బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రధాని పర్యటించే అవకాశం ఉన్నది. ఈ నెల 10వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ తోపాటు దక్షిణ తెలంగాణ జిల్లాలను కవర్ చేస్తూ.. మోదీ ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మోదీ మేనియా నడుస్తున్న వేళ.. ప్రచారం చివరి దశలో స్వయంగా ఆయనే రెండు రోజుల పాటు క్యాంపెయినింగ్ చేయడం కమలం పార్టీకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది.
కీలక అంశాలపై క్లారిటీ..
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు రిజర్వేషన్ల రద్దు, గాడిద గుడ్డు రాజకీయాలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉన్న సంబంధం గురించి ప్రధాని మోదీ ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. గత పదేండ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించిందనే విషయాలపైనా మోదీ ప్రసంగం ఉంటుందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ మేరకు మోదీ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.