నేను ధైర్యంగా చెప్తున్న మాకు డబుల్ డిజిట్ సీట్లొస్తయ్
అందరూ ఓటు వేయండి: కిషన్ రెడ్డి
- ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నడు
- 10 లక్షల కోట్ల అభివృద్ధి నీకు గాడిద గుడ్డులా కనిపిస్తున్నదా?
- ఉగ్రవాదాన్ని అణచివేసాం.. పాక్ ను ఏకాకి చేశాం
- ఒక్క రక్తం చుక్క పడకుండా ఆర్టికల్ 370 రద్దు చేశాం
- మోదీతోనే దేశంలో అభివృద్ధి సాధ్యమన్న కేంద్ర మంత్రి
నా తెలంగాణ, హైదరాబాద్:
తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మే13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ అసోసియేషన్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘‘మొన్నటి వరకు బీజేపీ, బీఆర్ఎస్ సీట్లు పంచుకుందన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రిజర్వేషన్స్ అంటున్నాడు. రిజర్వేషన్లు తీసేసే పరిస్థితి ఉండదు. కేంద్రం తెలంగాణకు పది లక్షల కోట్ల అభివృద్ధికి కృషి చేస్తే.. రేవంత్ కు అది గాడిద గుడ్డులా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి అనే ఆలోచన లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఎన్నికల కోసం స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నాడు. రేవంత్ తప్ప పార్టీలో ఎవరూ అలా మాట్లాడటం లేదు. మిత్రులు ఇద్దరు ఒక్కటయినట్టున్నారు.. ఆర్ఆర్ ట్యాక్స్ వేస్తున్నారు. రాష్ట్రంలో స్కూల్స్ బిల్డింగ్స్ కు కలర్ వేసే పరిస్థితి లేదు.. గతంలో కేసీఆర్ అంతే చేశాడు.. ఇప్పుడు రేవంత్ అదే చేస్తున్నాడు. ఫార్మా సిటీని రద్దు చేయాలని చూశాడు.. కంపెనీస్ వెళ్లి మాట్లాడగానే డీల్ మాట్లాడుకున్నాడు”అని కిషన్ రెడ్డి విమర్శించారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం..
స్వాత్యంత్రం వచ్చాక 2014 వరకు దేశంలో అనేక ఉగ్ర దాడులు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. “కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేశాను.. యూటీలతో పాటు పది రాష్ట్రాలకు ఇంచార్జ్ గా ఉన్నాను. ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నామని మోదీ, అమిత్ షా, కొందరు అధికారులకు, నాకు మాత్రమే తెలుసు. జమ్మూ కాశ్మీర్ లో 42 వేల మంది పాక్ కారణంగా చనిపోయారు. హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో ఐఎస్ఐకి నెట్ వర్క్ ఉండేది. మోదీ వచ్చాక దేశంలో ఐఎస్ఐ లేకుండా చేశాం. పాక్ ను టెర్రరిస్ట్ దేశంగా చేసి.. ప్రపంచంలో ఏకాకిని చేశాం. బ్రెడ్ ముక్క, బియ్యం కోసం పాక్ లో కొట్టుకుంటున్నారు. అక్కడ రోజుకో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లీడర్ చనిపోతున్నారు. ఎవరు చంపుతున్నారో కూడా ప్రపంచ దేశాలకు తెలియడం లేదు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు వరకు జమ్మూ కాశ్మీర్ కు ఒక ప్రధాని.. ఇండియాకు ఒక ప్రధాని ఉండేవారు. జమ్మూ కాశ్మీర్ లో మొన్నటి వరకు జిన్నా రాజ్యాంగం ఉండేది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో భారత రాజ్యాంగాన్ని అమలు చేసి హక్కులను కాపాడుతున్నాం. భయంకరమైన ఆర్టికల్ 370ని మోదీ ఒక్క రక్తం చుక్కా పడకుండా రద్దు చేశారు. శ్రీనగర్ లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగరాలని పెద్దల కోరిక ఉండేది. ఇప్పుడు లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగురుతున్నది. 33 ఏండ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాం. దేశమంతా అద్భుత రోడ్లు వేశాం. హైదరాబాద్ చుట్టూ ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరుగుతున్నది. ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఒక గేమ్ ఛేంజర్ కానుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీకి మెజార్టీ సీట్లు రాబోతున్నాయి”అని కిషన్ రెడ్డి తెలిపారు.