మోదీ పాదాభివందనం
అభిమానంతో కాళ్లకు మొక్కిన వృద్ధురాలు ప్రతినమస్కారం చేసిన ప్రధాని కీర్తి, ప్రతిష్ఠలకు ఇదే కారణం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఒడిశాలో ప్రధాని సభలో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. వ్యర్థాల నుంచి వస్తువులను తయారు చేసే కమల మోహరానా ప్రధాని మోదీ సభకు విచ్చేశారు. ఈ సభలో ఆమె మోదీని చూస్తూ భావోద్వేగానికి గురై ఆయన కాళ్లకు నమస్కరించారు. ఈ సందర్భంలో మోదీ పలుమార్లు దూరం జరుగుతూనే కాళ్లకు మొక్కవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా ఆమె అభిమానం ఊరుకోలేదో ఏమో గానీ మోదీ కాళ్లకు నమస్కరించారు.
ఆమె పైకి లేచిన తరువాత ప్రధాని మోదీ కమల మోహరానా పాదాలకు నమస్కరించారు. ఏది ఏమైనా పలు సందర్భాల్లో మోదీ చర్యలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రధాని ఎవ్వరినీ తన కాళ్లకు దండం పెట్టుకోనీయరు. ముఖ్యంగా మహిళలనైతే అస్సలు కాళ్లకు మొక్కవద్దని విజ్ఞప్తి చేస్తారు. అయితే పలుమార్లు పలుసభల్లో అభిమానం వల్ల మహిళలు మోదీ కాళ్లకు నమస్కరిస్తుంటారు. అలా నమస్కరించిన ప్రతీసారి ప్రధాని మోదీ తన పదవీ, కీర్తి, ప్రతిష్ఠలను పక్కన పెట్టి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వారి కాళ్లకు ప్రతినమస్కారం చేస్తారు. ఇది చాలాసార్లు, చాలా బహిరంగ వేదికలపై స్పష్టమైంది కూడా. ఏది ఏమైనా దేశ ప్రధాని అయినా ప్రధాని మోదీకి ఏ మత్రం అహంకారం లేదనేందుకు ఇవే నిదర్శనాలేమో. అందుకే ప్రపంచవ్యాప్తంగా మోదీని ఇష్టపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
కమల మోహరానా (63) ఒడిశా కేంద్రపాడా గుల్‌నగర్ కు చెందిన వారు. ఇక్కడ ఆమెను అందరు కమల ఆంటిగా పిలుచుకుంటారు. ఈమె ప్లాస్టిక్ వ్యర్థాలతో పలు ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేస్తుంటారు. ఇటీవల ప్రధాని మోదీకి చొక్కాతో చేసిన రాఖీని కూడా పంపారు. ఈమె స్వయం సహాయక బృందాన్ని నిర్వహిస్తున్నారు. వ్యర్థాల ద్వారా పౌచ్ లు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు చేస్తూ రీసైక్లింగ్ వినియోగిగాన్ని మహిళలకు తర్పీదునిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో 26న జరిగిన 98వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కమల మోహరానా చొరవను ప్రశంసించారు. వ్యర్థాలతో కూడా డబ్బును సంపాదించే ఈమె ఆశయాన్ని కీర్తించారు. దీని ద్వారా ఈమె స్వచ్ఛత అభియాన్ కు కూడా కొత్త రూపునిచ్చారని కొనియాడారు. కమల తన సోదరి అని కూడా ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.