నవాబులు, బాద్ షాలపై మాట్లాడరా? హిందు రాజులపై వ్యతిరేకతా?
పీఎఫ్ ఐకి సహకరిస్తారా? కర్ణాటక బెల్గావి సభలో ప్రధాని మోదీ
బెంగళూరు: భారత్ ను పాలించిన హిందు రాజులు, చక్రవర్తుల కృషి రాహుల్ గాంధీకి ఆ పార్టీ నేతలకు గుర్తుండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. నవాబులు, బాద్ షాలు, సుల్తానులు చేసిన అఘాయిత్యాలపై ఒక్కమాట కూడా రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. పీఎఫ్ఐని ఓట్ల కోసం కాంగ్రెస్ ఉపయోగించుకొని ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మానసికంగా ఆంగ్లేయుల బానిసత్వంలో ఇంకా నివసించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.
ఆదివారం కర్ణాటకలోని బెల్గావి ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పై విమర్శల బాణాలు విసిరారు.
రాజులు, మహారాజులు నిరంకుశులని, పేదల భూములను లాక్కునేవారని ఇటీవల రాహుల్ చేసిన కామెంట్లపై ప్రధాని విరుచుకుపడ్డారు. ఛత్రపతి శివాజీ, రాణి, చిన్నమ్మను రాహుల్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని, చరిత్రను కించపరుస్తూ కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.
బెంగళూరు కేఫ్ లో పేలుడు జరిగితే హస్తం పార్టీ పెద్దగా పట్టించుకోలేదెందుకని ప్రశ్నించారు. దేశ నాశనాన్ని కోరుకునే పీఎఫ్ ఐ పార్టీని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఉగ్రవాద ఘటనలపై సమర్థింపు చర్యలను దేశ ప్రజలు గమనిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు.
గత పదేళ్ల బీజేపీ కాలంలో దేశ ప్రజలందరికీ సమన్యాయం కోసం కృషి చేశామని తెలిపారు. నిరుపేదల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి భారత్ ను తీసుకురాగలిగిమని తెలిపారు. కర్ణాటకలోని హుబ్లీ క్యాంపస్ లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం కంటితుడుపు చర్యలకు పాల్పడిందన్నారు.
ప్రజల కంట్లో హస్తం పార్టీ దుమ్ముకొడుతోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.