పేదల సంపద దోచుకుంటారా?

అవినీతి సొమ్మును కక్కిస్తాం కాంగ్రెస్​, ఆర్జేడీ, కూటమి పార్టీలపై అమిత్​ షా ఫైర్​

Apr 10, 2024 - 18:18
 0
పేదల సంపద దోచుకుంటారా?

పాట్నా: బిహార్​ ను ఆర్జేడీ, కాంగ్రెస్​ పార్టీలు నిరుపేదల సంపదను దోచుకుతిన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 12 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయన్నారు. ప్రతీ పైసాను కక్కిస్తామని అమిత్​ షా స్పష్టం చేశారు. అవినీతి పరులను వదలబోమని జైలుకు పంపిస్తామని అమిత్​ షా తెలిపారు. గయా ఎంపి అభ్యర్థి జితన్‌రామ్‌ మాంఝీ, ఔరంగాబాద్‌ సుశీల్‌ సింగ్‌ ల తరఫున బుధవారం గయాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్​ షా మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీలు నిరుపేదలను దోచుకున్నాయని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం గయా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించిందని గుర్తు చేశారు. 

దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారా?

నాలుగు తరాలుగా కాంగ్రెస్​ దేశాన్ని పాలించి దేశ కీర్తి ప్రతిష్ఠలను మంటగలిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్​ ను ముక్కలు చేసే కుట్ర దిశగా ఆ పార్టీ పయనిస్తోందని మండిపడ్డారు. 1947లో భారత్​ ఒకసారి విచ్ఛిన్నం అయిందని మరోమారు దేశాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్​ తో పాటు ఇండి కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలపై సోనియా, రాహుల్​ గాంధీలు సిగ్గు పడాలన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ ను రూపుదిద్దే ప్రయత్నాలను తాము చేస్తున్నామన్నారు. రామమందిర నిర్మాణంలోనూ ఇలాంటి కుట్రలకే కాంగ్రెస్​, కూటమి పార్టీలు పాల్పడడం దేశ ప్రజలు చూశారని షా తెలిపారు. ఆర్టికల్​ 370 రద్దును కూడా లాలూ ప్రసాద్​ యాదవ్​ స్వాగతించలేకపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్​ హయాంలో ఆలియా, మాలియా, జమాలియా అనే ఉగ్ర సంస్థలు దేశంలో విధ్వంసం చేస్తుంటే వీరేమో విదేశాలకు వెళ్లి ఫిర్యాదులు చేసేవారన్నారు. సమాధానం ఇచ్చే సత్తా లేక చతికిలపడేవారని షా పేర్కొన్నారు. కానీ మోదీ వచ్చాక ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వారు ప్రపంచంలోని ఏ చివరన ఉన్నా వారికి భారత్ సత్తాను రుచి చూపించగలుగుతున్నామని స్పష్టం చేశారు. 

400పై చిలుకు స్థానాలు ఖాయం..

మోదీ అభివృద్ధిని చూసి దేశ ప్రజలు 400పై చిలుకు స్థానాలను అందించాలని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. భారీ మెజార్టీతో మరోమారు మోదీ హ్యాట్రిక్​ సాధిస్తారన్నారు. 21వ శతాబ్ధపు స్వావలంబనన భారత్​ ను రూపుదిద్దాలని మోదీ కంకణం కట్టుకున్నారని షా స్పష్టం చేశారు. శత్రువులు కూడా భారత్​ పై కన్నెయాలంటే గజగజ వణికిపోవాలని షా తెలిపారు. ఆధునిక భారత్​ రూపకల్పన, శాంతి సమ సమాజ స్థాపనే బీజేపీ లక్ష్యమని అమిత్ షా పునరుద్ఘాటించారు. లాలూ ప్రసాద్​ యాదవ్​ అవినీతి, అన్యాయాలకు ఆద్యుడే కాకుండా ప్రస్తుతం కులాల మధ్య కూడా చిచ్చు పెట్టేందుకు చూస్తున్నారని షా మండిపడ్డారు.