నా తెలంగాణ, నిర్మల్: జిల్లాలో మాతృత్వ మరణాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు. మాతృత్వ మరణాల నియంత్రణపై వైద్యారోగ్యశాఖ అధికారులతో ఆమె శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతృ మరణాలను నిరోధించడానికి కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత అధికారులతో హై పవర్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. దీపావళి తర్వాత ఈ హై పవర్ కమిటీ ఆధ్వర్యంలో హైరిస్క్ గర్భిణుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. దానికి అనుగుణంగా ఎక్కువ హైరిస్కు గర్భిణులు ఉన్న ప్రదేశాలలో ఏఎన్ఎంల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
గర్భం దాల్చిన వెంటనే మహిళలకు పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య స్థితిని నమోదు చేయాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో హై రిస్క్ గర్భస్థ మహిళలని గుర్తించి, దానికి అనుగుణంగా చికిత్సలను తీసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలన్నారు. గర్భిణులకు పోషకాహార ఆవశ్యకతపై అవగాహన కల్పించాలన్నారు. హై రిస్క్ గర్భిణులపై నిరంతర పర్యవేక్షణ ఉంచి, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిని తెలుసుకుంటూ అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. హైరిస్కు గర్భిణీలను గుర్తించేందుకుగాను గ్రామీణ స్థాయిలో ఏఎన్ఎం ఆశ, అంగన్ వాడీ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్, వైద్యాధికారులు సురేష్, సౌమ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.