ఏడు ఫోరెన్సిక్ లేబొరేటరీలు
Seven forensic laboratories
రూ. 860 కోట్లకు ప్రభుత్వం ఆమోదం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఏడు అదనపు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం రాజ్యసభ ప్రసంగంలో పాల్గొన్నారు. నేషనల్ ఫోరెన్సిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎన్‌హాన్స్‌మెంట్ స్కీమ్ కింద రూ. 860 కోట్లతో ఏడు అదనపు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఉంది. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలలో డీఎన్ ఏ విశ్లేషణ, సైబర్ ఫోరెన్సిక్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ప్రభుత్వం రూ. 245.29 కోట్ల కేటాయింపులో ఇప్పటి వరకు రూ. 185.28 కోట్లను విడుదల చేసింది.
నార్కోటిక్ డ్రగ్స్, సైకోపిక్ పదార్థాలు, డిజిటల్ ఫోరెన్సిక్స్, డీఎన్ ఎ ఫోరెన్సిక్ అనాలిసిస్, ఫోరెన్సిక్ సైకాలజీలో ఫోరెన్సిక్స్ కొత్త విభాగాలను చేర్చడానికి అటువంటి ల్యాబ్‌లలోని మెషినరీ, పరికరాలను అప్‌డేట్ చేశామన్నారు. భోపాల్, చండీగఢ్, అసోంలోని కమ్రూప్, హైదరాబాద్, పూణే, ఢిల్లీ, కోల్‌కతా, జమ్మూలోని సాంబాలో ఎనిమిది సెంట్రల్ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. 32 స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలు, 97 రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలను అనుసంధానించే ఇ-ఫోరెన్సిక్ ఐటీ ప్లాట్‌ఫారమ్ ఉందని మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.