ధోల్ పూర్ లో ఘోర ప్రమాదం టెంపోను ఢీకొన్న బస్సు 12మంది మృతి
Bad accident in Dholpur, 12 people were killed when a bus collided with a tempo
జైపూర్: రాజస్థాన్ ధోల్ పూర్ జిల్లా సునిపూర్ గ్రామ సమీపం నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. శనివారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేగంగా వస్తున్న స్లీపర్ కోచ్ బస్సు మినీ టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 8మంది చిన్నారులు ముగ్గురు మహిళలున్నారని తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. బీరీ గుమత్ లో ఉంటున్న నహ్ను, జహీర్ లకుటుంబాలు కలిసి వివాహ వేడుకలో హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బస్సు టెంపోను ముందునుంచి ఢీకొట్టిదన్నారు. హైవేపై వెళుతున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నామని తెలిపారు. మృతదేహాలను బరి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని తెలిపారు. ఈ ప్రమాదంలో స్లీపర్ కోచ్ బస్సు డ్రైవర్, కండక్టర్ లు కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని అడిషనల్ ఎస్పీ కమల్ కుమార్ తెలిపారు.