లోక్‌సభ ఎన్నికలు.. 71వేల మందికి డిపాజిట్లు దక్కలే
ఒకటవ లోక్ సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి 16వ లోక్ సభ ఎన్నికలు పూర్తయిన నాటికి మొత్తం 71 వేల మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయి ‘సెక్యూరిటీ డిపాజిట్‌గా జమచేసిన మొత్తాన్ని’ కోల్పోయినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం ఓ ప్రకటనలో వివరించింది.
నా తెలంగాణ, ఢిల్లీ: ఒకటవ లోక్ సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి 16వ లోక్ సభ ఎన్నికలు పూర్తయిన నాటికి మొత్తం 71 వేల మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయి ‘సెక్యూరిటీ డిపాజిట్‌గా జమచేసిన మొత్తాన్ని’ కోల్పోయినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం ఓ ప్రకటనలో వివరించింది. కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం.. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు 91,160 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 71,246 మందికి డిపాజిట్లే రాలేదు. అంటే 78 శాతం అభ్యర్థులకు వారు డిపాజిట్ చేసిన మొత్తం పైకం దక్కలేదు. 1951–-52లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో 1874 మందికి గాను 745 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.
1991–-92లో 86శాతం మంది అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్లు కోల్పోయారు. 1996లో 11వ లోక్‌సభ ఎన్నికల్లో 91 శాతం అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. మొత్తం 13,952 అభ్యర్థులు బరిలో ఉండగా.. 12,688 మందికి చుక్కెదురైంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడిన లోక్‌సభ ఎన్నికలు కూడా ఇవే కావడం గమనార్హం. 2009లో 85 శాతం, 2014లో 84 శాతం అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.
2019 ఎన్నికల్లో 86 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పార్టీల వారీగా చూస్తే బీఎస్పీ అగ్రస్థానంలో నిలిచింది. 383 మంది పోటీ చేస్తే అందులో 345 మంది చెల్లించిన డిపాజిట్ పైకం కోల్పోయారు. ఈ తర్వాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్‌లో.. 421 అభ్యర్థులకుగాను 148 మంది డిపాజిట్ కోల్పోవడంతో పాటు తాము చెల్లించిన మొత్తాన్ని కూడా దక్కించుకోలేకపోయారు. చెల్లించిన డిపాజిట్ కోల్పోతామని ముందే తెలిసినా తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారని అధికారులు పేర్కొన్నారు. మరికొందరేమో రెబెల్ అభ్యర్థులను రంగంలోకి దింపుతారని తెలిపారు.
తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ కింద జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఉండేది. ప్రస్తుతం అది జనరల్ అభ్యర్థులకు రూ.25 వేలు, ఎస్సీ/ఎస్టీలకు రూ.12,500లకు పెరిగింది. ఇలా డిపాజిట్ విలువ భారీగా పెంచినప్పటికీ అభ్యర్థుల సంఖ్య ప్రతీ ఎన్నికల్లో పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు.