కేజ్రీ రాజీనామా చేయాలని బీజేపీ నిరసన
ఆందోళనలో బీజేపీ అధ్యక్షుడు సచ్ దేవాకు స్వల్ప గాయాలు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణంలో అరెస్టు అయి జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ ఆందోళన చేపట్టింది. బుధవారం ఆప్ ఢిల్లీ కార్యాలయం వద్ద పెద్ద పెట్టున బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాయకులను, కార్యకర్తలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. అదుపు చేసే క్రమంలో సచ్ దేవాకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు నిరసన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం వాటర్ కెనాన్ లను ప్రయోగించారు. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆందోళన సందర్భంగా సచ్ దేవా మాట్లాడుతూ.. సీఎం రాష్ర్ట పాలనను వదిలి జైలులో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన ఎవరు చూడాలని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలకు దొంగసొమ్మును ముటగట్టుకొని భారీగా సంపాదించారని ఆరోపించారు. వెంటనే సీఎం రాజీనామా చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఓ వైపు కోర్టులు కూడా సీఎంకు మొట్టికాయలు వేస్తున్నా ఆయనకు సిగ్గురావడం లేదని విమర్శించారు. మరోవైపు సుప్రీంకు వెళతామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎక్కడికి వెళ్లినా ఏ కోర్టులైనా అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేసినట్లు చరిత్రలో లేదని బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా అన్నారు.