నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: కన్న కూతురిని కడతేర్చిన తండ్రికి జీవిత ఖైదు శిక్ష విధించినట్టు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. మంగళవారం కేసు విచారణ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి జి. భవానీ చంద్ర నిందితునికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 500 జరిమానా విధించారని తెలిపారు.
కేసు పూర్వాపరాలను వెల్లడించారు. కాంట్రోత్ రవి నాయక్ (41) కూలీ పనులు చేస్తుంటాడు. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. సదాశివపేట ఆత్మకూర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. మొదటి భార్య కూతురు (13) నవాబ్ పేట కస్తూర్బా పాఠశాలలో చదుకుంటుంది. ఆమె ఆరోగ్యం బాగా లేనందున చికిత్స గురించి సదాశివపేటకు తీసుకొని వచ్చి, తిరిగి వెళుతుండగా మార్గమధ్యలో గొంతు నులిమి చంపి, జ్వరంతో చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. గాయాలను చూసి అనుమానం వచ్చిన పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి వికారాబాద్ ఎస్ హెచ్ వో శ్రీనివాసులు, ఎస్ఐ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి సదాశివపేటకు ట్రాన్స్ ఫర్ చేశారన్నారు. దర్యాప్తు చేపట్టిన ఎస్ హెచ్ వో శ్రీధర్ రెడ్డి కాంట్రోత్ రవి బాలికను చంపినట్లు గుర్తించి చార్జీషీట్ దాఖలు చేశారు.
నిందితునికి శిక్షపడేలా కృషి చేసిన అధికారులు అప్పటి యస్.హెచ్.ఒ. శ్రీధర్ రెడ్డి ఇన్స్ పెక్టర్ యస్.హెచ్.ఒ. మహేష్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ, కోర్ట్ డ్యూటీ హెడ్.కానిస్టేబుల్స్ రవి, వెంకటేశ్వర్లు, కోర్ట్ లైజనింగ్ అధికారి కె. సత్యనారాయణ ఎస్ఐ. లను ఎస్పీ చెన్నూరి రూపేష్ అభినందించారు.