అన్నదాతల ఎదురుచూపులు
సంగారెడ్డి జిల్లాలో 7,318 ఎకరాలు దెబ్బతిన్న పంటలు
4,968 మంది రైతులకు నష్టం
సర్వేతో సరిపెడుతున్న అధికారులు
నా తెలంగాణ, సంగారెడ్డి: ఇటీవల వారం పది రోజులు ఎకధాటిగా కురిసిన భారీ వర్షాలకు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు నెలకొరిగాయి. సంగారెడ్డి జిల్లాలో భారీగా పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 7318 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 4968 మంది రైతులు నష్టపోయారు. రాత్రి పగలు కష్టపడి పండించిన పంటలు భారీ వర్షాల కారణంగా నష్టపోయామని వాపోతున్నారు. జిల్లాలో 2243 మండి రైతులకు చెందిన 2317 ఎకరాల్లో ప్రత్తి పంట దెబ్బతిన్నది. సోయాబీన్ 1973 ఎకరాల్లో దెబ్బతినగా 473 మంది రైతులు నష్టపోయారు. 95 మంది రైతులకు చెందిన 128 ఎకరాల్లో కంది, 196 మంది రైతులకు చెందిన మినుములు, 175 మందికి చెందిన పెసర 1878 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఇద్దరు రైతులకు సంబంధించిన ఏడు ఎకరాల్లో మెరుపు పంట దెబ్బతినగా కూరగాయలు సాగుచేసిన 60 రైతులకు చెందిన 108 పంటలకు నష్టం వాటిలింది.
సర్వేతో సరి..
జిల్లాలో పంటల నష్టపరిహారంపై వ్యవసాయశాఖ అధికారులు ఆగ మేఘాల మీద సర్వే నిర్వహించి చేతులు దులుపుకున్నారు. పంటల నష్ట పరిహారం అందించేందుకు అధికారులు దెబ్బతిన్న పంటల సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి 15 రోజులు గడుస్తున్నా, పరిహారం ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించేందుకు ఎందుకు జాప్యం చేస్తుందని రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఆదుకోని ప్రభుత్వం..
రైతు భరోసా డబ్బులు అన్నదాతలకు అందకపోవడంతో వేలల్లో అప్పులు చేసి పంటలు సాగు చేసుకున్నారు. ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేటు వ్యాపారుల వద్ద వడ్డీలకు రుణాలు తీసుకుని పంటలు సాగు చేసుకున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలు భారీ వర్షాలకు దెబ్బతిని పూర్తిగా నష్టపోయామని కన్నీరు మున్నీరవుతున్నారు. రైతులకు ఎకరాకు రూ. 15 వేలు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. నష్టపరిహారంతో పాటు రైతు భరోసా డబ్బులు కూడా తమకు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అన్నదాతలు. ఏడాదికి రూ. 15 వేలు రైతు భరోసా ఇస్తామని, రైతు రుణమాఫీ ఏకకాలంలో రూ. 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయడం లేదని రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
పంట మొత్తం నీళ్లలో మునిగిపోయింది..
శ్రీకాంత్, రైతు, కులబ్ గూర్
ఎంతో కష్టపడి తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి పంట వేశాను. రోజుకు రూ. 1000 రూపాయలు కూలీలు ఇచ్చి పంట నాట్లు వేయించాను. వర్షాల కారణంగా పంట మొత్తం నెలకొరిగింది. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
ప్రభుత్వం నుంచి రాగానే చెల్లిస్తాం: శివప్రసాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
జిల్లాలో వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.
ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి: జయరాజు, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులకు వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు పరిహారం చెల్లించి వెంటనే ఆదుకోవాలి. అదేవిధంగా రైతు భరోసా డబ్బులు కూడా చెల్లించి రైతులందరికీ షరతులు లేని రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.