కలిసి కట్టుగా అనిశ్చితిని ఎదుర్కొందాం
Let's face the uncertainty together
- సానుకూల వాతావరణానికి కలిసి నడుద్దాం
- సామాజిక సవాళ్లను పరిష్కరించుకుందాం
- యూపీఐ లావాదేవీలతో భారత్ లో వృద్ధి నమోదు
- ఆఫ్రికా, పసిఫిక్ ద్వీప దేశాల్లో ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భారత్
- ఐక్యతగా మానవతా సంక్షోభాన్ని నివారించుకుందాం
- వాయిస్ ఆఫ్ గ్లోబల్ మూడో సమ్మిట్ లో ప్రధాని మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రపంచదేశాల్లో కొనసాగుతున్న అనిశ్చితిని అన్ని దేశాలు కలిసి కట్టుగా తొలగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దక్షిణ దేశాలు పరస్పర వాణిజ్యం, సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, పురోగతి, మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించాలని భారత్ కోరుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. ఇందుకోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్, ఎనర్జీ కనెక్టివిటీ ద్వారా భారత్ దక్షిణాది దేశాలతో పరస్పర సహకారం పెంచుకుంటోందని మోదీ తెలిపారు.
శనివారం వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ప్రారంభోపన్యాసంలో ప్రధాని మోదీ సభ్య దేశాలను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించారు. భారత్ నిర్వహిస్తున్న మూడో సమావేశం కావడం గమనార్హం.
ఈ కార్యక్రమానికి హాజరైన దేశాలకు హృదయపూర్వకంగా స్వాగతించారు. దక్షిణాది దేశాలతో మాట్లాడే అవకాశం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేశారు. జీ–20కి అధ్యక్షత వహించినప్పుడే దక్షిణాది దేశాల సహాయ సహకారాలను పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు మోదీ తెలిపారు. జీ–20 ద్వారా సమ్మిళిత అభివృద్ధిని కాంక్షించామన్నారు. కోవిడ్, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణాది దేశాల ముందు అనేక సవాళ్లు ఉన్నాయని తెలిపారు. సానుకూల వాతావరణాన్ని సృష్టించుకునే దిశగా దేశాలు ముందుకు సాగాలని తెలిపారు.
వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం తదితర అవసరాలను తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో ప్రపంచానికి పెనుముప్పుగా మారిన వేర్పాటువాదం, ఉగ్రవాదం లాంటి వాటిని సంయుక్తంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సాంకేతికతకు సంబంధించిన కొత్త ఆర్థిక, సామాజిక సవాళ్లు కూడా పుట్టుకొస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. గతంలో పరిష్కారం లభించని సమస్యలకు పరిష్కారాన్ని వెతికే పనిని అందరం కలిసి చేపడదామని కోరారు. సామర్థ్యాల పెంపు, సమస్యల పరిష్కారం కోసం దక్షిణాది దేశాలన్నీ కలిసి పనిచేస్తే సత్ఫలితాలు సాధ్యమని తెలిపారు.
భారత్ తమ భాగస్వామ్య దేశాలతో ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం యూపీఐని అనుసంధానించిందని తెలిపారు. ఇది దక్షిణాది దేశాల్లో భారత్ వేగవంతమైన అభివృద్ధి వైపు ఎదిగేందుకు దోహదం చేస్తుందన్నారు.
ఆఫ్రికా, పసిఫిక్ ద్వీప దేశాలలో భారత్ ఆసుపత్రులు, డయాలసిస్ యంత్రాలు, జన ఔషధి కేంద్రాల ద్వారా మానవతా సంక్షోభాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. ప్రపంచదేశాల్లో మానవతా సంక్షోభం సమయాల్లో భారత్ ఆపన్న హస్తానికి ఎన్నటికీ ముందువరుసలో నిలుస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
దక్షిణాది దేశాలు ఐక్యతతో పనిచేస్తూ నూతన ఒరవడితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇందుకు అన్ని దేశాలు సంయుక్తంగా శాంతి, సుహృద్భావ వాతావరణంలో పనిచేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.