రాష్ట్ర ఆర్థిక శాఖలో కీలక మార్పులు
సందీప్ కుమార్ సుల్తానియాకు 9 విభాగాలు కృష్ణ భాస్కర్ కు 13 విభాగాలు కేటాయింపు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రామకృష్ణారావుకు బాధ్యతలు
నా తెలంగాణ, హైదరాబాద్ : ఆర్థిక శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసింది. కొన్నేళ్లుగా ఆర్థిక శాఖలో చక్రం తిప్పిన ఆయనకు పనిభారం తగ్గింపు పేరుతో అధికారాల్లో కోత విధించింది. ఆర్థిక శాఖ పరిధిలో వచ్చే 9 విభాగాలకు ఒక సీనియర్ అధికారికి, మరో 13 శాఖలను మరో సీనియర్ అధికారికి కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహణలో భాగంగా పెను మార్పులు తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొంత కాలంగా ఆర్థిక శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఉన్న అధికారాల్లో పని విభజన చేసి సీనియర్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానీయా, కృష్ణ భాస్కర్ కు పలు సబ్జెక్టులు సీఎస్ శాంతి కుమారి కేటాయించారు. సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాకు రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎస్సీ డెవలప్‌మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరిస్ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ ఆఫీస్, డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగాలను అప్పగించారు. మరో సీనియర్ ఐఏఎస్ కృష్ణ భాస్కర్ కు ఫైనాన్స్ కమిషన్, ఓపీ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్, ప్రాజెక్టు డైరెక్టరేట్ ఆఫ్ డీబీటి స్కీం, ట్రాన్స్‌పోర్ట్, ఆర్ అండ్ బీ, ఐ అండ్ పీఆర్, ఎండోమెంట్, ఎన్విరాన్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హౌజింగ్, ఎనర్జీ, ఇండస్ట్రీస్, ఐటీ విభాగాలను అప్పగించారు.